మన తెలంగాణ/హైదరాబాద్: పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిర్మిస్తు న్న ఇందిరమ్మ ఇళ్లకు రూ.230కే సిమెంట్ బస్తాలను రాయితీపై సరఫరా చేస్తున్నామని, త్వరలో స్టీల్‌ను కూడా రాయితీ ధరకు సరఫరా చేయడానికి ప్రయత్నిస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఈ వివరాలు వెల్లడించారు. పరిశ్రమల శాఖ మంత్రితో కలిసి స్టీల్ పరిశ్రమల యజమానులతో సమావేశం నిర్వహించి, రాయితీపై స్టీల్ అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

పేదలకు ఇల్లు అంటే కేవలం నాలుగు గో డలు కాదని, అది ఆత్మగౌరవానికి ప్రతీక అని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నట్లుగానే పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదల సొంతింటి కలను కూడా సాకారం చేస్తామని తెలిపారు. స్థలాల కొరతను దృష్టిలో ఉంచుకుని జిహెచ్‌ఎంసి పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ తరహాలోనే నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర మున్సిపల్ కార్పొరేషన్లలోనూ ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలను గుర్తించి, గుడిసెలు లేని తెలంగాణ నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.