
బెంగళూరు: ఆర్డర్ డెలివరీ చేసేందుకు వచ్చిన ఓ యువకుడు మహిళ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి ఆమె ఎదుట అసభ్యంగా ప్రవర్తించిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బాధిత మహిళ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని మారతహళ్లి ప్రాంతంలో ఓ మహిళ ఎదుట అసభ్యంగా ప్రవర్తించిన 22 ఏళ్ల డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ను ఆదివారం అరెస్ట్ చేశారు. నిందితుడిని విజయ్ మల్లికార్జున్ కామత్‌గా గుర్తించారు.
శనివారం సాయంత్రం మున్నెకొలాల ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌కు ఆర్డర్ డెలివరీ చేసేందుకు నిందితుడు వెళ్లాడు. బాధిత మహిళ ఫిర్యాదు ప్రకారం.. బాత్‌రూమ్ ఉపయోగించుకోవాలని డెలివరీ బాయ్ పట్టుబట్టాడు. అనంతరం బాత్‌రూమ్ నుంచి బయటకు వచ్చిన అతడు మహిళ ఎదుట అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనను మహిళ వీడియోగా రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీడియో పోలీసుల దృష్టికి రావడంతో మారతహళ్లి పోలీస్ స్టేషన్ అధికారులు బాధిత మహిళను సంప్రదించి చర్యలు ప్రారంభించారు.
నీలోఫర్ ఫాతిమా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సెక్షన్లు 75, 79, 329(2) కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపులు, సంబంధిత నేరాలకు సంబంధించిన నిబంధనల కింద ఈ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. “ఫ్లిప్‌కార్ట్ డెలివరీ బాయ్ తనను లైంగికంగా వేధించినట్లు నీలోఫర్ ఫాతిమా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మారతహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు విజయ్ మల్లికార్జున్ కామత్ (22)ను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు” అని వైట్‌ఫీల్డ్ డీసీపీ సైదులు అద్వైత్ తెలిపారు.
ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఫ్లిప్‌కార్ట్ స్పందించింది. ఇది తమను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూ సంబంధిత డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ను విధుల నుంచి తొలగించినట్లు తెలిపింది. “ఈ ఘటన మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. బాధిత వినియోగదారురాలికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాం. వినియోగదారుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత డెలివరీ భాగస్వామితో ఒప్పందాన్ని రద్దు చేశాం.
ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దర్యాప్తు అధికారులకు పూర్తిగా సహకరిస్తాం” అని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. డెలివరీ భాగస్వాములను విధుల్లోకి తీసుకునే ముందు వారి నేపథ్యాన్ని పరిశీలించడంతోపాటు తప్పనిసరి శిక్షణ ఇస్తామని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఇలాంటి ఘటనలు అత్యంత అరుదుగా జరిగినప్పటికీ ఒక్క ఘటనను కూడా అంగీకరించబోమని స్పష్టం చేసింది. వినియోగదారుల భద్రతా చర్యలను మరింత పటిష్ఠం చేసేందుకు అదనపు చర్యలు అవసరమా అనే అంశాన్ని సమగ్రంగా సమీక్షిస్తున్నట్లు తెలిపింది.












