వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ తాజాగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే వీటిని సమర్ధవంతంగా అడ్డుకున్నట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌పై శక్తివంతమైన సైనిక చర్య తప్పదని హెచ్చరించారు. ‘శత్రువులను మనం అత్యంత ఘోరంగా దెబ్బకొట్టబోతున్నాం.. వారికి గట్టిగా బుద్ధి చెబుతాం’ అని ట్రంప్ ఒక ఫోన్ కాల్ ఇంటర్వ్యూలో తెలిపారు.

సంఘటన వివరాల ప్రకారం, జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గారడ్స్ కారప్స్ అర్ధరాత్రి వేళ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే అమెరికా సెంట్రల్ కమాండ్ వెంటనే వాటిని గాల్లోనే కూల్చేసింది. ఈ దాడిలో అమెరికా సైనిక సిబ్బందికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దౌత్యపరమైన చర్చలకు అవకాశం కల్పించేందుకు ఇరాన్‌పై అమెరికా తాత్కాలికంగా దాడులు నిలివేసిన తర్వాత యూఎస్ స్థావరంపై టెహ్రాన్ దాడి చేయడం ఇదే ప్రథమం, కాగా, జోర్డాన్ సార్వభౌమాధికారంపై జరిగిన ఈ దాడిని కువైట్, ఖతార్ దేశాలు తీవ్రంగా ఖండించాయి.