వాషింగ్టన్: ఇరాన్‌తో కొత్తగా ప్రారంభమవుతున్న చర్చలు ఆ దేశానికి చివరి అవకాశమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుని, దాడులు మరింత తీవ్రం కాకుండా చూసుకోవాలని సూచించారు. వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో సోమవారం మీడియాతో మాట్లాడిన ట్రంప్, వాషింగ్టన్‌టెహ్రాన్ మధ్య జరుగనున్న చర్చలు ప్రధానంగా హార్మూజ్ జలసంధిని మళ్లీ పూర్తిగా తెరవడం, అలాగే ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికాకు ఉన్న ఆందోళనలను పరిష్కరించే దిశగా సాగుతాయని చెప్పారు. చర్చల పురోగతిపై ఈరోజు లేదా రేపు స్పష్టత వస్తుందని తెలిపారు. మొదటి దశ హార్మూజ్ జలసంధిని తెరవడం. రెండో దశ ఇరాన్ అణు నిరాయుధీకరణ. దీనికి కొంత సమయం పడుతుంది అని ట్రంప్ పేర్కొన్నారు.

గత ఐదు నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో అమెరికా దాడులతో ఇరాన్ సైనిక నాయకత్వం, వైమానిక దళం, నౌకాదళానికి భారీ నష్టం వాటిల్లిందని ట్రంప్ చెప్పారు. అయితే, అమెరికాలో ఆయుధ నిల్వలు తగ్గిపోవడం, నవంబర్ మధ్యంతర ఎన్నికల ముందు యుద్ధంపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం వంటి అంశాలు తమకు అనుకూలంగా మారతాయని ఇరాన్ భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ఆదివారం ఇరాన్‌పై రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద దాడి చేపట్టేందుకు అమెరికా సిద్ధమైందని, అయితే ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకుల విజ్ఞప్తితో పాటు ఇరాన్ అధికారుల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని ఆ దాడిని నిలిపివేసినట్లు ట్రంప్ వెల్లడించారు. ముఖ్యంగా సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఈ విషయంలో కీలకంగా వ్యవహరించారని తెలిపారు. అయితే ఇరాన్‌పై తన సహనం తగ్గిపోతోందని ట్రంప్ స్పష్టం చేశారు. మంచి ఒప్పందంపై సంతకం చేసుకునేందుకు వారికి ఇదే చివరి అవకాశం అని హెచ్చరించారు.

అంతకుముందు సోషల్ మీడియాలో కూడా ట్రంప్ ఇరాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఒమాన్‌తో జరిగిన సమావేశాలు హార్మూజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి తాత్కాలిక మార్గం ఏర్పాటుపైనే జరిగాయని ఇరాన్ ప్రకటించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం కావాలని వాళ్లే కోరుతున్నారు. చర్చలు ప్రారంభమయ్యాయి. మరిన్ని సమావేశాలు కూడా జరగనున్నాయి. అయినా ఎలాంటి చర్చలు జరగడం లేదని బహిరంగంగా చెబుతున్నారు. ఇది ద్వంద్వ వైఖరి అని ట్రంప్ విమర్శించారు.

ఇరాన్ అంగీకరించినా, అంగీకరించకపోయినా అణ్వాయుధాల అభివృద్ధిని అడ్డుకునే అంశంపైనే ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ గతంలో కూడా ఇరాన్‌పై దాడులు తీవ్రతరం చేస్తామని పలుమార్లు హెచ్చరించి, చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయంపై విలేకరులు ప్రశ్నించగా, ఇరాన్ ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని చివరి అవకాశం ఇస్తున్నాను. వారు మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను అని సమాధానమిచ్చారు. అయితే, ట్రంప్ వైఖరిని విమర్శిస్తున్న వారు మాత్రం అమెరికా సైనిక శక్తి ఒక్కటే ఇరాన్‌ను వెనక్కి తగ్గించలేదనే వాస్తవాన్ని ప్రభుత్వం అంతర్గతంగా గుర్తించిందని, అందుకే దౌత్యపరమైన పరిష్కారానికి మరోసారి అవకాశం ఇస్తోందని అభిప్రాయపడుతున్నారు.