టెహ్రాన్: పశ్చిమ ఇరాన్‌లో ఇంధన ట్యాంకర్ పేలిపోవడంతో 11 మంది మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడినట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా ఐఆర్‌ఎన్‌ఎ తెలిపింది. కుర్దిష్ నగరమైన సనందజ్ సమీపంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట శనివారంనాడు ఈ ప్రమాదం జరిగినట్టు పేర్కొంది. ట్యాంకర్ తొలుత కొన్ని కార్లను ఢీకొన్ని అనంతరం మంటల్లో చిక్కుకుని పేలిపోయినట్టు తెలిపింది. బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పేర్కొంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించింది.

2018లోనూ సనందజ్ సమీపంలో ఇంధన ట్యాంకరు, ఇంటర్‌సిటీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో 15 మంది మరణించగా, నలుగురు గాయపడ్డారు. ఇరాన్‌లో రోడ్డు, ట్రాఫిక్ ప్రమాదాల కారణంగా ఏటా 17,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. భద్రతా ప్రమాణాలు లేని వాహనాలు, ట్రిఫిక్ నిబంధనలను పట్టించుకోకపోవడం, అత్యవసర సేవలు తగినంతగా అందుబాటులో లేకపోవడం వంటివి అధిక మరణాలకు కారణంగా నిపుణులు ఆరోపిస్తున్నారు.