
న్యూఢిల్లీ: ఇరాన్‌పై సైనిక దాడులు కొనసాగిస్తోన్న అమెరికా.. ఇప్పుడు ఆ దేశ ఆర్థిక జీవనాధారంపై దెబ్బకొట్టేందుకు సిద్ధమైంది. టెహ్రాన్‌ను ఏకాకిని చేసేందుకు మరో ఎత్తుగడతో రంగంలోకి దిగింది. ఇరాన్‌తో వ్యాపారం చేసే లేదా ఆ దేశానికి ఏ రూపంలోనైనా సహాయం అందించే దేశాలపై ‘తీవ్రమైన’ ఆర్థిక చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం హెచ్చరించారు.
ఇరాన్‌ను ఆర్థికంగా ఒంటరి చేసే లక్ష్యంతో ఈ హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటివరకు చేపట్టిన అత్యంత కఠినమైన ఆర్థిక చర్యగా దీన్ని అభివర్ణించిన ట్రంప్.. ఇరాన్‌కు అందుతున్న అన్ని రకాల ఆర్థిక సహాయాలను తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేశారు. ఏ దేశమైనా తమ వ్యాపార సంస్థలు, ఆర్థిక సంస్థలు, విమానాశ్రయాలు లేదా ప్రభుత్వ సంస్థల ద్వారా ఇరాన్‌కు జీవనాధారాన్ని అందిస్తే గనుక ఆ దేశం తీవ్రమైన ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. చమురు అక్రమ రవాణా, కరెన్సీ మార్పిడి ఒప్పందాలు, నగదు బదిలీలు, మనీ ఎక్స్ఛేంజ్ సంస్థలు, నౌకల రిజిస్ట్రేషన్లు, ముసుగు కంపెనీలు వంటి కార్యకలాపాలన్నీ తక్షణమే ఆపాలని అన్నారు.











