తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థులు చేపడుతున్న ఆందోళనకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు ప్రకటించారు. విద్యార్థులు వ్యతిరేకిస్తున్న జీవో ఎంఎస్ నంబర్ 97ను వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

జీవో 97 కారణంగా రాష్ట్రంలోని వేలాది మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడవద్దని ఆయన సూచించారు. నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించి, జీవోను వెనక్కి తీసుకోవాలని కోరారు.

మరోవైపు, తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ఐటీఐలు, అప్రెంటిస్ ట్రైనింగ్ సెంటర్లతో విలీనం చేయాలన్న ప్రతిపాదన, అలాగే వాటిని కొత్త శక్తి (SHAKTI) విభాగం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడంపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

మూడేళ్ల డిప్లొమా కోర్సు ప్రత్యేకత దెబ్బతినే అవకాశం ఉందని, భవిష్యత్తులో బీటెక్‌లో లేటరల్ ఎంట్రీ వంటి అవకాశాలపై ప్రభావం పడవచ్చని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 22న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం నిర్వహించాలని విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి.

ఇప్పటికే బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం, పార్టీ నేతలు పలు నిరసనల్లో పాల్గొని విద్యార్థులకు సంఘీభావం తెలిపారని కేటీఆర్ వెల్లడించారు. విద్యార్థుల ఆందోళనకు పార్టీ అన్ని విధాలా మద్దతు కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.