
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎప్‌సెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు 70నుంచి 80శాతం వరకు కళాశాలల్లో రిపోర్ట్ చే సినట్లు తెలిసింది. మిగతా 20 శాతం కళాశాలల్లో చేరడానికి ముందుకు రావడం లేదు. ఇంజనీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్‌లో 79,891 సీట్లు కేటాయించగా, 8,162 మిగిలాయి. సీట్లు పొందిన వా రిలో 19,325 మంది ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చే యలేదు. దాంతో మొత్తం సీట్లతో పాటు అదనం గా అందుబాటులోకి వచ్చిన 4,347 సీట్లను రెం డో విడత కౌన్సెలింగ్‌లో అందుబాటులోకి తీసుకువచ్చారు. రెండు విడతల్లో కలిపి మొత్తం 80,167 సీట్లు కేటాయించగా, 71,452 మంది విద్యార్థు లు రిపోర్టింగ్ చేయగా, 8,710 మంది రిపోర్టింగ్ చేయలేదు. తుది విడత కౌన్సెలింగ్‌లో 22,972 అందుబాటులో ఉండగా, వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఆదివారం ముగిసింది.ఈ నెల 5వ తేదీన చివరి విడత ఇంజనీరింగ్ సీట్లు కేటాయించనున్నారు. ఎప్‌సెట్‌లో ర్యాంకు సాధించి ఎప్‌సెట్‌తో పాటు ఇతర కౌన్సెలింగ్‌లలో కూడా పాల్గొంటున్న మెరిట్ విద్యార్థులు ఐఐటి, ఎన్‌ఐటి వంటి జాతీ య సంస్థలలో సీటు లభిస్తే అక్కడికే వెళ్తున్నారు. ఈసారి టాప్ కళాశాలల్లో సీట్లకు కూడా ఇదివరకు ఉన్న డిమాండ్ కనిపించడం లేదు.
ఇదివరకు టాప్ కళాశాలల్లో కన్వీనర్ కోటాతో పాటు యాజమాన్య కోటా సీట్లు 100 శాతం భర్తీ అయ్యేవి. యాజమాన్య కోటా సీట్ల కోసం కనీసం ఆరు నెలల ముందే అడ్వాన్స్ చెల్లించి సీటు రిజర్వ్ చే సుకునేవారు. కానీ, గత రెండు మూడేళ్లుగా టాప్ కళాశాలల్లో సైతం కొన్ని బ్రాంచీల్లో సీట్లు మిగులుతున్నాయి. మెరిట్ విద్యార్థులు ఐఐటి,ఎన్‌ఐటి, ఇతర జాతీయ విద్యాసంస్థల వైపే మొగ్గు చూపుతున్నారు.రాష్ట్ర ఎప్‌సెట్‌కు హాజరయ్యే మెరిట్ విద్యార్థులు, జెఇఇ వంటి జాతీయ ప్రవేశ పరీక్షకు కూడా సీరియస్‌గా సిద్దమై పరీక్ష రాస్తున్నారు. దాంతో వారికి రెండు పరీక్షల్లో మంచి ర్యాంకులే వస్తున్నాయి. మొదటి ప్రాధాన్యత మాత్రం జెఇఇకే ఇస్తున్నారు. ఈ ఏడాది ఎప్‌సెట్ ర్యాంకులు పొందిన విద్యార్థుల్లో సుమారు 15 శాతం మంది ఐఐటి- జెఇఇ మెయిన్, అడ్వాన్స్‌డ్ జాతీయ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి ఐఐటి, ఎన్‌ఐటిల్లో సీట్లు పొందారు. ఇదివరకు ఇక్కడి టాప్ కళాశాలల్లో ఒక సీటు కోసం వందల మంది మెరిట్ విద్యార్థులు పోటీ పడేవారు. కానీ ఏడాదికి ఏడాదికీ పరిస్థితి మారుతూ వస్తోంది. మెరిట్ విద్యార్థులు ఐఐటి, ఎన్‌ఐటిలకే అధిక ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర కళాశాలల వైపు చూడటం లేదు.
ఏటా మిగులుతున్న సీట్లు
ఒకప్పుడు ఇంటర్ ఎంపిసి ఉత్తీర్ణత అయితే చాలు, ఏదో ఒక కళాశాలలో ఇంజనీరింగ్‌లో చేరేవారు. రానురాను ఇంజనీరింగ్ విద్యలో ప్రమాణాల పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించడం, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విద్యార్థులకు మెరిట్ ఉంటేనే ఉద్యోగాలు ఇచ్చేందుకు కంపెనీలు ముందుకురావడం వంటి పరిణామాల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల ఆలోచన విధానం కూడా మారుతూ వస్తోంది. ఖర్చు ఎక్కువైనా ఎన్‌ఐటి, ఐఐటి, ఇతర జాతీయ సంస్థల్లో ఇంజనీరింగ్ చేయడమే ఉత్తమమని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ అక్కడ సీటు రాకపోతే ఇక్కడి టాప్ కళాశాలల్లో ప్రవేశం పొందేలా ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో రాష్ట్రంలో ఏటా సీట్ల సంఖ్య పెరుగుతున్నా, కన్వీనర్ కోటా సీట్లు కూడా పూర్తిగా భర్తీ కావడం లేదు. ఈ ఏడాది రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద 176 కాలేజీల్లో 94,424 సీట్లు అందుబాటులోకి ఉండగా, రెండో విడతలో 80,167(84.9 శాతం) సీట్ల కేటాయింపు జరిగింది. అందులో 71,452 మంది విద్యార్థులు రిపోర్టింగ్ చేయగా, 8,710 మంది రిపోర్టింగ్‌కు దూరంగా ఉన్నారు.








