
ఒడిశా నుంచి కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న భారీ స్థాయి గంజాయిని కూసుమంచి పోలీసులు ఈగల్ టీమ్ సహాయంతో పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 4న ఒడిశా నుంచి కర్ణాటకకు గంజాయి తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో కూసుమంచి పోలీసులు ఈగల్ టీమ్ సహకారంతో హైవేపై జీళ్లచెరువు శివారులో వాహనాల తనిఖీ చేపట్టారు. బొలెరో వాహనం, కారు, మోటార్ సైకిల్‌ను తనిఖీ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. అనుమానితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 331 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
సరుకు విలువ సుమారు రూ.1.65 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.రెండు సెల్‌ఫోన్లు, రెండు వాహనాలు, మోటార్ సైకిల్, రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం ఉప్పరిగొట్ల గ్రామానికి చెందిన వంతల గోపీనాథ్, తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలానికి చెందిన ఎం.నాగరాజు సత్నూర్, కర్ణాటక రాష్ట్రానికి చెదిన ఖిలో లక్ష్మణ్ అరెస్టు కాగా.. బురిడి సీతారాం, అలంగి లైసెన్, మనోజ్‌కుమార్, శివప్ప, దొండో అలియాస్ రాజు, కొర్ర లోకోన్, మల్లిఖార్జున్, మన్యం కార్తీక్‌కుమార్‌లు పరారీలో ఉన్నారని పోలీసులు వివరించారు.











