మన తెలంగాణ/హైదరాబాద్‌ః జెన్-జి మహిళలను అవమానించిన బిజెపి ఎంపీ కంగనా రనౌత్ బహిరంగ క్షమాపణ చెప్పాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ వద్ద నిరసన చేసిన జెన్-జి ఉద్యమ మహిళలపై మండి నియోజకవర్గం ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణంగా, బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

అక్కడ ఉన్న మహిళలు చదువుకోలేదు, అన్పడ్, గవార్, మంచి గృహిణి కూడా కాలేరు వంటి వ్యాఖ్యలు కంగన చేశారని ఆమె తెలిపారు. జెన్ జి అమ్మాయిలు తమ హక్కుల కోసం పోరాడుతుంటే పోలీసులు అమానుషంగా లాఠీ చార్జ్ చేశారని ఆమె విమర్శించారు. ఎంపీ కంగన ఒక మహిళగా ఉండి మహిళలపై ఇలా మాట్లాడడం సిగు చేటని అన్నారు. ఎంపీ కంగన వెంటనే క్షమాపణ చెప్పి నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్ చేశారు.