జగిత్యాల జిల్లాలోని మూడు రైస్ మిల్లులలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించి 87 కోట్ల రూపాయల విలువ చేసే సిఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు. విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ అడిషనల్ ఎస్పీ బసవరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా సివిల్ సప్లై అధికారి ఎస్ జితేందర్ రెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జగిత్యాల జిల్లాలోని శ్రీ అభయాంజనేయ సాయి రైస్ మిల్, శ్రీ లక్ష్మీ బాలాజీ ఇండస్ట్రీస్, లక్ష్మీ గణపతి ఇండస్ట్రీస్ లలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో రైస్ మిల్లులకు అందించిన ధాన్యాన్ని లెక్కించిన అధికారులు రూ. 87 కోట్ల విలువ చేసే సీఎంఆర్ ధాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పక్కదారి పట్టినట్లు

గుర్తించారు. ఈ విషయాన్ని అధికారులు జిల్లా కలెక్టర్ కు నివేదించగా అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లుల యాజమాన్యాలపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రైస్ మిల్లుల యజమానులపై జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో అధికారులు ఫిర్యాదు చేయగా పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అధికారులు జరిపిన తనిఖీల్లో కేవలం మూడు రైసు మిల్లులలో 87 కోట్ల రూపాయల ధాన్యం పక్కదారి పట్టినట్లు తేలడం జిల్లాలో కలకలం రేపుతోంది. మూడు రైసుమిల్లులలో ఇంత పెద్ద మొత్తంలో ధాన్యం పక్కదారి పట్టిందంటే ఈ లెక్కన జిల్లాలోని మిగతా రైస్ మిల్లులలో ధాన్యం భద్రంగా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.