
న్యూఢిల్లీ: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు ఉండవని తెలంగాణ బిజెపి చీఫ్ రామచందర్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పార్టీ నేతల మధ్య విభేదాలు లేవని.. బేధాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయన్నారు. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘తెలంగాణలో బిజెపి ఎవరితోనూ పొత్తులు పెట్టుకోదు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం. కీలక నేతలు మా పార్టీలో చేరేందుకు సమయం కోసం వేచి చూస్తున్నారు. బిజెపిలో కొత్త, పాత అనే తేడా లేదు. తెలంగాణ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది. అందరూ కలిసి పోరాటం చేయాలని నితిన్ నబీన్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి రోడ్ మ్యాప్ తయారు చేయాలని ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మరోసారి ఎంపి, ఎమ్మెల్యేలతో సమావేశం జరుగుతుంది. 937 మండలాలలో పార్టీని బలోపేతం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఆరు గ్యారంటీలపై పోరాటం చేస్తాం’’ అని రామచందర్ రావు తెలిపారు.











