
మన తెలంగాణ/హైదరాబాద్: జనగణన -2027 కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో స్వీయ నమోదు ప్రక్రియను ఆదివారం అధికారికంగా ప్రారంభించారు. లోక్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆన్‌లైన్ ద్వారా స్వయంగా తన వివరాలను నమోదు చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ జనాభా గణన ఒక కీలక జాతీయ కార్యక్రమమని పేర్కొన్నారు. ఇది దేశంలోని జనాభా, వారి సామాజిక-, ఆర్థిక పరిస్థితులపై సమగ్ర సమాచారం అందించడంతో పాటు, సమర్థవంతమైన ప్రణాళిక, సుపరిపాలన, వనరుల సమాన పంపిణీకి పునాదిగా నిలుస్తుందని తెలిపారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి, గృహనిర్మాణం, మౌలిక సదుపాయాల వంటి రంగాలలో విధానాల రూపకల్పనలో జనగణన ముఖ్య పాత్ర పోషిస్తుందని వివరించారు.
కచ్చితమైన సమాచారంతో లక్ష్యిత సంక్షేమ పథకాలు రూపొందించడమే కాకుండా, దేశ పురోగతిని సమర్థవంతంగా అంచనా వేయడానికి ఇది సహకరిస్తుందని గవర్నర్ అన్నారు. రాష్ట్రంలో ఇదే మొదటి జనాభా గణన కావడం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుందని గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి కోసం ఖచ్చితమైన డేటా సేకరణ అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో స్వీయ గణన దశ ఏప్రిల్ 26 నుంచి మే నెల 10 వ తేదీ వరకు కొనసాగుతుంది. అనంతరం మే 11 నుంచి జూన్ 9 వరకు గృహ జాబితా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇది దేశంలో మొట్టమొదటి పూర్తి డిజిటల్ జనగణన కావడం విశేషం.
స్వీయ నమోదు ప్రక్రియ సులభం, సౌకర్యవంతం, వినియోగదారులకు అనుకూలంగా రూపొందించబడిందని తెలిపారు. తాను స్వయంగా ఈ ప్రక్రియను పూర్తి చేశానని, ఇది సరళంగా, సమర్థవంతంగా ఉందని గవర్నర్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని, కచ్చితమైన సమాచారం అందించి జనగణన సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల భాగస్వామ్యం ద్వారా బలమైన, సమ్మిళితమైన, సుస్థిరమైన తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందని గవర్నర్ తన సందేశంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెన్సెస్ డైరెక్టర్ భారతీ హోళికేరి, జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్.వి. కర్ణన్, గవర్నర్ సంయుక్త కార్యదర్శి కె. శశి కిరణాచారి తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు
జనగణనలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. జనగణన సెన్సెస్ 2027 కార్యక్రమంలో సిఎం రేవంత్‌రెడ్డి ఆదివారం పాల్గొన్నారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్‌కు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సెన్సెస్ అధికారులు వివరించారు. వైబ్‌సైట్ ద్వారా తన వివరాలను సిఎం రేవంత్‌రెడ్డి నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టరేట్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోళికేరి, జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్‌వి కర్ణన్, జాయింట్ ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్ ప్రియాంక అల, ఐ అండ్ పిఆర్ కమిషనర్ సిహెచ్ ప్రియాంక, ఇతర అధికారులు పాల్గొన్నారు.
స్వీయనమోదు ప్రక్రియలో పాల్గొన్న గుత్తా, నిరంజన్
ప్రతి పౌరుడు విధిగా జనాభా లెక్కల నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. కుటుంబ వివరాలను నమోదు చేయడం ద్వారా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించిన వాళ్ళం అవుతామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. జూబ్లీహిల్స్‌లోని చైర్మన్ గుత్తా నివాసానికి ఆదివారం వచ్చిన అధికారులకు ఆయన తనతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను ఆయన తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వాన్, డిప్యూటీ కమిషనర్ ఎన్. శంకర్ తదితర అధికారులు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ‘ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. బిసి కమిషన్ ఛైర్మన్ జి. నిరంజన్ ఆదివారం జనగణన స్వీయ గణన కార్యక్రమంలో భాగంగా వెబ్‌సైట్ ద్వారా తన వివరాలను సమర్పించారు. గణన సిబ్బంది తమ వద్దకు వచ్చే వరకు వేచి ఉండకుండా, తెలంగాణ ప్రజలందరూ స్వీయ గణన కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది గణన సిబ్బందికి వారి పనిని పూర్తి చేయడంలో కూడా సహాయపడుతుందన్నారు. వెబ్‌సైట్ ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంటుందని, వివరాలు నమోదు చేయడానికి కేవలం 15 నిమిషాలు మాత్రమే పడుతుందని, ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అందరూ పాల్గొనాలి: సిఎస్
జనగణన 2027 లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు పిలుపునిచ్చారు. జనగణన 2027 భాగంగా ప్రారంభమైన సెల్ఫ్ ఎన్యూమరేషన్ (స్వీయ నమోదు)లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ఆదివారం పాల్గొని తమ వివరాలు నమోదు చేసుకున్నారు. ఉదయం తన నివాసంలో ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా స్వీయ గణన పూర్తి చేసి, సెన్సస్ ఆఫ్ ఇండియా-2027 కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి కుటుంబం జనగణనలో చేరేందుకు స్వీయ గణనలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోలికేరి, జీహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్‌వి.కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.














