న్యూఢిల్లీ: జనన మరణాలు నమోదులో జాప్యం జరుగుతుండటంపై కేంద్రం మరింత కఠిన నిబంధనలను తెచ్చింది. ఈ జాప్యాన్ని నివారించి సకాలంలో వీటిని రిజిస్టర్ చేసేలా పౌరులను ప్రోత్సహించడమే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొంది. ఇందుకు సంబంధించి ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ బరత్స్ అండ్ డెత్స్ (సవరణ) బిల్లు-2026’ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ విపక్ష సభ్యుల నిరసనల మధ్య బుధవారంనాడు లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

ఈ చట్ట నిబంధనల ప్రకారం జనన మరణాల రిజిస్ట్రేషన్‌లో ఏడాది నుంచి రెండేళ్లు జాప్యం చోటుచేసుకుంటే జిల్లా మెజిస్ట్రేట్ (డీఎం), సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ (ఎస్‌డీఎం) లేదా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అనుమతి అవసరం. వారి సమక్షంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. 2 సంవత్సరాలకు మించి జాప్యం జరిగితే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి. జనన మరణాల రిజిస్ట్రేషన్ చట్టం-1969 ప్రకారం వీటి నమోదు తప్పనిసరి. ఈ చట్టం ప్రకారం జారీ చేసే సర్టిఫికెట్‌కు లీగల్ ఐడెంటిటీ ఉంటుంది. 2023లో దీనిని సవరించారు. సవరించిన చట్ట నిబంధనలు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.