
టోక్యో: భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ సాధించి నయా చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సింధు 2117, 2117 తేడాతో చిరకాల ప్రత్యర్థి అకానె యమగూచి (జపాన్)ను ఓడించింది. 2022 తర్వాత ఓ ప్రధాన టోర్నమెంట్‌లో సింధు టైటిల్ గెలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. యమగూచితో జరిగిన తుది పోరులో సింధు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. తన మార్క్ షాట్లతో అలరించిన సింధు ఏ దశలోనూ యమగూచికి పైచేయి సాధించే ఛాన్స్ ఇవ్వలేదు. నిలకడైన ఆటతో లక్షం దిశగా సాగింది.
ఇదే క్రమంలో ఎలాంటి ప్రతిఘటన లేకుండానే సెట్‌ను దక్కించుకుంది. తర్వాతి సెట్‌లోనూ భారత షట్లర్‌కు ఎదురు లేకుండా పోయింది. అద్భుత ఆటతో అలరించిన సింధు ప్రత్యర్థిని హడలెత్తించింది. తీవ్ర ఒత్తిడికి గురైన అకానె వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సింధు సఫలమైంది. చివరి వరకు నిలకైడన ఆటను కనబరుస్తూ వరుసగా రెండో సెట్ గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో జపాన్ ఓపెన్ టైటిల్ సాధించి తొలి భారత షట్లర్ నయా రికార్డును నెలకొల్పింది. ఫైనల్లో గెలిచిన అనంతరం సింధు భావోద్వేగానికి గురైంది. ఈ క్రమంలో ఆమె కళ్లలో నీళ్లు వచ్చాయి. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఓ టోర్నీలో టైటిల్ సాధించడంతో సింధు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.











