
కెసిఆర్‌కు పేరు వస్తుందనే.. గోదావరి జలాలు ఎత్తిపోయడం లేదు
రాష్ట్రంలో మళ్లీ బోరుబండ్లు తిరిగే పరిస్థితి వచ్చింది
రైతులు కన్నెర్రజేస్తే కాంగ్రెస్ పని ఖతమే
మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం
రంగనాయక సాగర్ వరకు రైతుల మహాపాదయాత్రలో పాల్గొన్న సిద్దిపేట ఎంఎల్‌ఎ
మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: రాష్ట్రంలో నెలకొన్న ఈ కరువు కాలం తెచ్చిన కరువు కాదని, ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన కరువేనని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు మండిపడ్డారు. కాళేశ్వరం మోటర్లు ఆన్ చేసి వెంటనే సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూరు మండలం రైతులు ఆదివారం అనంతగిరి పోచమ్మ రిజర్వాయర్ నుంచి రంగనాయకసాగర్ రిజర్వాయర్ వరకు చేపట్టిన మహా పాదయాత్రలో ఆయ న పాల్గొన్నారు. అనంతరం రంగనాయకసాగర్ వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో రైతులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తికావడంతోనే కాలంతో పనిలేకుండా భూమికి బరువైనంత పంటలు పండాయన్నారు. మళ్లీ కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు పంట పొలాలకు అందితే కేసీఆర్‌కు మంచిపేరు వస్తుందన్న అక్కసుతో రేవంత్ రెడ్డి మోటర్లను ఆన్ చేయడం లేదని మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై పగ పట్టి కాళేశ్వరంపై కక్ష పెట్టుకుని మోటార్లను ఆన్ చేయడం లేదన్నారు. మోటర్లు ఆన్‌చేసి రిజర్వాయర్లు నింపకుంటే రానున్న రోజుల్లో కరువు తీవ్రతరమవుతుందని రిటైర్డ్ ఇంజినీర్లు చెప్పినా రేవంత్‌రెడ్డి వినకుండా.. చెప్పినవారినే జైల్లో వేస్తామనడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ పాలనలో కరువు అనే పదం కనబడకుండా పోతే రేవంత్ పాలనలో మాత్రం కరువు విపరీతంగా పెరిగిపోయిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం, రేవంత్ తప్పుడు నిర్ణయాలతోనే రాష్ట్రం ప్రతీ రంగంలో వెనుకబడిపోతుందన్నారు. గోదావరిలో నీళ్లున్నప్పటికీ రేవంత్ ఎందుకు ఒడిసిపట్టడం లేదని మండిపడ్డారు. రేవంత్ 70 టీఎంసీల నీటిని వదులుకుంటుంటే ఏపీ సీఎం చంద్రబాబు నీటిని ఒడిసి పట్టుకుంటున్నారన్నారు. కేసీఆర్ అన్ని రిజర్వాయర్లకు దేవుళ్లు పేరు పెట్టారని ఒకవేళ మోటర్లు ఆన్‌చేసి ఈ రిజర్వాయర్లలో కాళేశ్వరం జలాలను నింపకుంటే రేవంత్ దేవుళ్ల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు నింపితే భద్రాచలం శ్రీరాముల వారి గుడికి ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు.
బీఆర్‌ఎస్ పాలనలో అత్యధిక పంట సాగు జరగడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు మన రాష్ట్రానికి జీవనోపాధి కోసం వలస వచ్చారని ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్టా మళ్లీ ఇతర రాష్ట్రాలకు మన రాష్ట్రం నుంచి వలసలు వెళ్లే పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉన్నదన్నారు. కావాలంటే తన రక్తాన్ని తీసుకొని రైతులకు సాగునీరు అందించాలని కోరారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక అన్నిరంగాల్లో అన్యాయమే జరుగుతుందన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో కనబడని బోరుబండ్లు మళ్లీ రాష్ట్రంలో తిరిగే పరిస్థితి వచ్చిందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో తరుగు తీస్తే తోలు తీస్తానన్న రేవంత్ రెడ్డి దళారులు, మిల్లర్ల చేతుల్లో తోలుబొమ్మగా మారిపోయాడన్నారు. రాష్ట్రంలో హిట్లర్ పాలన కొనసాగుతుందన్నారు. రైతులకు రూ.35 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని సగం మందికి చేసి మిగతా రైతులకు ఎగనామం పెట్టారన్నారు.
కేసీఆర్ తీసుకువచ్చిన రైతు బీమా రైతుకు ఒక ధీమాగా మారిందన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతుబంధు, రైతు బీమా, ఎరువులు, విద్యుత్ సరఫరా ఇలా ప్రతి రంగంలో రైతులకు అన్యాయమే జరుగుతుందన్నారు. కనీసం ధాన్యం విక్రయించడంలో సైతం రైతులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. రైతులు కన్నెర్రజేస్తే కాంగ్రెస్ సర్కార్ ఖతమవుతుందన్నారు. స్కామ్‌ల కాంగ్రెస్ ప్రభుత్వం పోయి స్కీంల కేసీఆర్ ప్రభుత్వం రావాలని యావత్ రాష్ట్ర ప్రజానీకం కోరుకుంటుందన్నారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజలకు చేసిన సేవలే శాశ్వతంగా గుర్తుండిపోతాయన్న విషయాన్ని రేవంత్ గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ మహా పాదయాత్ర ఒక్క చిన్నకోడూరు మండలంలోని రైతులు మాత్రమే చేశారన్నారు. కరువు తీవ్రతరమవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న విషయాన్ని గమనించి వెంటనే మోటర్లు ఆన్‌చేసి రిజర్వాయర్లన్నీ నింపాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులు తిరగబడే పరిస్థితి నెలకొంటుందని హెచ్చరించారు. ఈ పాదయాత్రలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, పార్టీ నాయకులు వేలేటి రాధాకృష్ణ శర్మ, కూర మాణిక్యరెడ్డి, వెంకటేశ్వరరావు చిన్న, సాయిరాం, శ్రీనివాస్, మధు, కనకరాజు, శ్రీహరి యాదవ్, ఉమేష్, ఆంజనేయులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.











