గ్లాస్గో: కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2026లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటివరకూ భారత్ 12 పతకాల(2 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్యాలు)తో పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. మహిళల బాక్సింగ్ 51 కెజిల విభాగంలో సాక్షి చౌదరి ఈ పతకాన్ని ఖాయం చేసింది. క్వార్టర్ ఫైనల్‌లో ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన కైట్లిన్ ఫ్రయర్స్‌ను 5-0 తేడాతో మట్టికరిపించి సెమీ ఫైనల్స్‌కి దూసుకెళ్లింది. దీంతో భారత్‌కు కనీసం కాంస్య పతకం ఖరారైంది.

ఈ బౌట్‌లో ఆరంభం నుంచి సాక్షి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మూడు రౌండ్లలోనూ ఏకగ్రీవంగా 5-0 స్కోరుతో విజయం సాధించింది. ఫైనల్ బెర్త్ కోసం శుక్రవారం జరిగే సెమీఫైనల్‌లో కెనడాకు చెందిన అంబర్-జేన్ వాల్‌తో సాక్షి తలపడనుంది.