
హైదరాబాద్: రుణమాఫీపై సిఎం రేవంత్ రెడ్డి పచ్చిఅబద్ధాలు చెబుతున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. దేవుళ్ల మీద ఒట్టేసి మాట తప్పారని అన్నారు. అశోక్ నగర్ లో ధ్వంసమైన చారిత్రక మట్టికోట శివాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వరంగల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 800 ఏళ్ల చరిత్రను రేవంత్ కాలరాస్తున్నారని.. భయం, భక్తి లేని వ్యక్తి అని హరీష్ రావు విమర్శించారు. గుప్తనిధులు, విలువైన వస్తువుల కోసమే ఆలయం ధ్వంసం చేశారని, కాకతీయులు నిర్మించిన పురాతన ఆలయాలపై రేవంత్ కన్నేశారని ధ్వజమెత్తారు. నిజంగానే స్కూల్ నిర్మాణం కోసమైతే అర్థరాత్రి పనులు ఎందుకు? అని ప్రశ్నించారు. నిధుల కోసమే తవ్వకాలు జరపారన్న అనుమానాలున్నాయని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.















