కావేరీ జలాల వివాదం మరోసారి తమిళనాడు-కర్ణాటక మధ్య చిచ్చు రేపింది. దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శుక్రవారంనాడు స్పందించారు. ప్రస్తుత పరిస్థితిలో తమిళనాడు సర్కార్‌తో చర్చల్లేవని స్పష్టం చేశారు.తమిళనాడుకు 15 రోజుల పాటు కావేరీ జలాలను విడుదల చేయాలంటూ కావేరీ వాటర్ మేనేజిమెంట్ అథారిటీ కర్ణాటకకు ఆదేశాలు జారీ చేయడం, దీంతో కర్ణాటకలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులపై విధాన సౌధలో మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తమిళనాడుతో నేరుగా చర్చలు జరిపేందుకు ప్రస్తుతానికి సానుకూల వాతావరణం లేదన్నారు.

ఈ వివాదంపై ఆగస్టు మొదటి వారంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, రైతులు, విపక్షాలతో చర్చించిన అనంతరమే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన బెంగళూరు పర్యటనను వాయిదా వేసుకోవాలని కోరారు. కాగా, కావేరీ వాటర్ మేనేజిమెంట్ అథారిటీ ఆదేశాలపై ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల కన్నడ అనుకూల గ్రూపులు నిరసనలకు దిగాయి. తమిళనాడు సీఎం విజయ్ నటించిన ‘జన నాయగన్’ స్క్రీనింగ్‌ను నిలిపివేశారు. విపక్షాలు సైతం ఆగస్టు 13న రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి.