
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సిజెపి) డిమాండ్లను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. నీట్ (యూజీ) పరీక్షలో జరిగిన అవకతవకల కారణంగా సిజెపి ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ధర్మేంద్ర రాజీనామాతోపాటు, మరో రెండు డిమాండ్లపై చర్చించేందుకు కేంద్ర మంత్రులు జెపి నడ్డా, జితేంద్ర సింగ్ ల పిలుపు మేరకు సీజేపీతో ప్రతినిధులు వారితో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులతో సీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, సీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా దాదాపు రెండు గంటలపాటు జరిగిన చర్చల అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిజెపి ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రధానంగా మూడు డిమాండ్లపై కేంద్రంతో చర్చించామని... ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తమ మొదటి డిమాండ్ నెరవేరిందని తెలిపారు. ఢిల్లీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పాలిత అన్ని రాష్ట్రాల్లోని విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం అంగీకరించిందని.. నిరసనకారులపై భవిష్యత్తులోనూ ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చిందని తెలిపారు.ఇక, ఆత్మహత్య చేసుకుని మరణించిన నీట్ అభ్యర్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అందించాలన్న తమ డిమాండ్‌కు కూడా ప్రభుత్వం అంగీకరించిందని..నియమ నిబంధనలు మేరకు బాధిత కుటుంబాలకు పరిహారం అందిస్తామని హామి ఇచ్చినట్లు చెప్పారు.
కాగా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, విద్యార్థుల డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం అంగీకరించడంతో సిజెపి తమ ఆందోళనను విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. అలాగే, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నుంచి నిరసనకారులను శాంతియుతంగా వెనుదిరగాలని కోరింది.








