
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ నెలకొంది. 2026 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) ఘన విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, సిఎంగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ హైకమండ్ చర్చలు జరుపుతోంది.
రేపు(మే 12) సిఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. దీంతో సిఎం అభ్యర్థిని ఖరారు చేసేందుకు, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) మాజీ అధ్యక్షులందరితో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వరుస సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సంప్రదింపులు అనంతరం తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.
కాగా, ముఖ్యమంత్రి పదవి రేసులో కెసి వేణుగోపాల్, వి.డి. సతీశన్, రమేష్ చెన్నితాల ఉన్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, మే 14న ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగవచ్చని కూడా వర్గాలు తెలిపాయి.
దశాబ్దాలలో కేరళ రాజకీయాల్లో చోటుచేసుకున్న అత్యంత కీలక పరిణామాలలో ఒకటిగా, 2026 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) ఘన విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది; తద్వారా లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) యొక్క పదేళ్ల పాలనకు ముగింపు పలికింది.
UDF 102 స్థానాలతో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించగా, LDF కేవలం 35 స్థానాలకు పరిమితమైంది; ఇది రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో ఒక నాటకీయమైన మార్పును సూచిస్తోంది.















