
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలిపారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గ్లోబరిన్ సంస్థ ఇంటర్మీడియట్ విద్యార్థుల చావుకు కారణం అయ్యిందని ఆయన శుక్రవారం పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, జగ్గారెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విమర్శించారు. కెటిఆర్ కనీసం పుట్టిన రోజునైనా నిజాలు మాట్లాడకుండా అన్నీ అబద్దాలే మాట్లాడారని ఆయన విమర్శించారు. ధర్నా చౌక్ ఎత్తేసిన చరిత్ర బిఆర్‌ఎస్‌దని, అయినా కెటిఆర్ అక్కడికి వెళ్ళి విద్యార్థులతో పాటు ధర్నాలో పాల్గొనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పైగా అక్కడ అన్నీ అబద్దాలే మాట్లాడారని ఆయన విమర్శించారు.
ధర్నా చౌక్‌లో ముక్కు నేలకు రాసి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పి వేదికపైకి వెళితే బాగుండేదన్నారు. ధర్నా చౌక్‌ను బిఆర్‌ఎస్ ఎత్తి వేస్తే తాము ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు పౌరులకు ఉందని మళ్లీ పునరుద్దరించామని ఆయన గుర్తు చేశారు. ఎనబై ఏళ్ళ వయసులో మల్లికార్జున ఖర్గే విద్యార్థుల పక్షాన పోరాడుతుంటే, మీ తండ్రి కెసిఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని ఆయన తూర్పారపట్టారు.











