25,300కిలోల కల్తీ మసాల దినుసులు స్వాధీనం

13 ప్రాంతాల్లో హెచ్‌ఫాస్ట్ అధికారుల దాడులు

ముగ్గురు నిందితుల అరెస్టు

వివరాలు వెల్లడించిన నగర సిపి విసి సజ్జనార్

మనతెలంగాణ /సిటిబ్యూరోః ప్రమాదకరమైన రసాయనాలతో మసాల దినుసులు తయారు చేస్తున్న ముఠాను హెచ్‌ఫాస్ట్( ది హైదరాబాద్ ఫుడ్ అడాల్ట్రేషన్ సర్వైలెన్స్ టీం), జిహెచ్‌ఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేసి అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 25,300కిలోల వివిధ రకాల కల్తీ మసాల దినుసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ టిజిఐసిసిసిలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్, కాటేదాన్‌కు చెందిన రాహుల్ భాటి, బేగంబజార్‌కు చెందిన విశాల్ పన్వర్, దులిచంద్ కచ్చావార్ ప్రమాదకరమైన రసాయనాలతో మసాల దినుసులు తయారు చేస్తున్నారు.

వాము, జిలకర, లవంగాలు, సాజీరా, సోంపు, ఆవాలు, జీరా డస్ట్, మెంతులు, నువ్వులు, షైనింగ్ పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్‌కు ప్రమాదకరమైన రసాయనాలు కలిపి విక్రయిస్తున్నారు. రసాయనాలతో తయారు చేసిన మసాలా దినుసులను ఎపి, తెలంగాణలోని పలువురికి విక్రయిస్తున్నారు. 13 వ్యాపార సంస్థలు నకిలీ మసాలాలు తయారు చేస్తూ హోల్ సేల్, రిటైల్‌గా విక్రయిస్తున్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసి నిందితులు మసాలాలలో ప్రమాదకరమైన, విషపూరితమైన పదార్థాలను కలుపుతున్నారు.

ఆహారంలో ఉపయోగించే బుష్ సింథటిక్ ఆరెంజ్ రెడ్, గ్రీన్ ఫుడ్ కలర్స్, దస్తులకు వేసే రంగులు, పారిశ్రామిక రంగులు, షైనింగ్ పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ వంటి విషపూరిత రసాయనాలను ఉపయోగిస్తున్నారు. లవంగాలు, షాజీరా వంటి సుగంధ ద్రవ్యాలకు ఆకర్షణీయమైన రంగు రావడం కోసం సింథటిక్ రంగులను పూస్తున్నారు, షాజీరా, వాము (అజ్వైన్) మసాలాలకు పారిశ్రామిక రంగులను కలుపుతున్నారు. టాస్క్ ఫోర్స్ డిసిపి గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్లు రంజిత్, అంజయ్య, సబ్ ఇన్‌స్పెక్టర్లు శంకర్, కృష్ణ, అఖిల్ , సిబ్బంది దాడులు చేశారు.

హానికర రసాయనాలతో ...

ఫ్యాబ్రిక్ డైలు, సింథటిక్ కలర్స్‌తో మసాలాలు తయారు చేస్తున్నారని సిపి విసి సజ్జనార్ తెలిపారు. టాల్కమ్ పౌడర్, ఇండస్ట్రీయల్ డైలు, రైస్ బ్రాన్ ఆయిల్ వినియోగిస్తున్నట్లు చెప్పారు. మసాలాలకు మెరుపు కోసం హానికర రసాయనాలను వినియోగిస్తున్నారని తెలిపారు. రంగులు వేసి నాణ్యమైన మసాలాల మాదిరిగా విక్రయిస్తున్నారని తెలిపారు. ఆహార భద్రత చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కల్తీ మసాలాల నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపామని వెల్లడించారు.

సిట్‌తో దర్యాప్తు...

కల్తీ ఆహార పదార్థాల తయారీపై సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించనున్నట్లు హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ తెలిపారు. కల్తీ ఆహార పదార్థాలను అరికట్టేందుకు హెచ్‌ఫాస్ట్ దాడులు కొనసాగుతాయని, కల్తీ వస్తువులు తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి విసి సజ్జనార్ హెచ్చరించారు. పారిశ్రామిక రంగులు, సింథటిక్ రంగులు, టాల్కమ్ పౌడర్ వంటి తినకూడని పదార్థాలను ఉపయోగించిన మసాలాలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, కిడ్నీలు, ఊపిరితిత్తులు పాడయ్యే అవకాశం ఉందని తెలిపారు. నగర ప్రజల పరిసర ప్రాంతాలలో కల్తీ ఆహారం తయారు చేస్తున్నా, అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని వండుతున్నా, వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

140 రోజుల్లో 246 టన్నులు సీజ్...

హెచ్‌ఫాస్ట్ బృందం, జిహెచ్‌ఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి నగరం నలుమూలలా విసృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. హెచ్‌ఫాస్ట్ 140 రోజుల్లోనే 659 దాడులు చేసి, 202 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. దాదాపు 246 టన్నుల కల్తీ ఆహారాన్ని సీజ్ చేసింది. 232 కేసులను జిహెచ్‌ఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించగా, 46 పనీర్, 83 నెయ్యి విక్రయ కేంద్రాలలో తనిఖీలు చేపట్టింది. అల్లం-వెల్లుల్లి పేస్ట్ తెల్లగా, చిక్కగా కనిపించడానికి పెయింట్లలో వాడే టైటానియం ఆక్సైడ్, ఎసిటిక్ యాసిడ్ ఉపయోగిస్తున్నట్లు బయటపడింది. 32 కేంద్రాలలో పొట్టు తీయని, కుళ్లిన అల్లం, వెల్లుల్లితో పేస్ట్‌ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. 27,024 కిలోల అల్లంవెల్లుల్లి కల్తీ పేస్ట్ సీజ్ చేశారు, అలాగే 12 టన్నులకు పైగా కుళ్ళిన కోడి, మేక మాంసం, హోటళ్లకు సరఫరా చేసేందుకు నిల్వ ఉంచిన 60 టన్నుల కోడి వ్యర్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాల చుక్కలేకుండా తయారు చేస్తున్న 1.5టన్నుల సింథటిక్ పన్నీర్, 3.8 టన్నుల కల్తీ టీ పొడిని సీజ్ చేశారు.