
“కమలం పువ్వులో జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్ర పవన్ కళ్యాణ్ ఓ రెక్కలాంటి వారు..” అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఎంత కమల్ కళ్యాణ్‌లు పుట్టుకుని వచ్చినా తమ పార్టీకి నష్టమేమీ లేదని ఆయన శుక్రవారం పార్టీ అధికార ప్రతినిధి సామ రాంమోహన్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. జనసేన పార్టీ కార్యాలయాన్ని నగరంలోని మణికొండలో ప్రారంభించడం గురించి ప్రశ్నించగా, మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా ప్రతిస్పందిస్తూ కమలం పువ్వుకు ఎన్నో రెక్కలు ఉంటాయని వాటిల్లో పవన్ కళ్యాణ్ ఓ రెక్క వంటివారని అన్నారు. సామరస్యంగా వస్తే తమకేమీ ఇబ్బంది లేదని ఆయన వ్యాఖ్యానించారు.
త్యాగధనుల కుటుంబంలో పుట్టి వారసుడైన రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నానని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఉన్న వ్యక్తులు యూనివర్సిటీలో దూరడం వల్ల విద్యా వ్యవస్థ గతి తప్పిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 22 లక్షల మంది విద్యార్థులు రేయింబవళ్ళు చదివి పరీక్షలు రాస్తే కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వల్ల వాళ్ల కష్టం బూడిద పాలైందని ఆయన విమర్శించారు. నిరుద్యోగ యువత తరపున రాహుల్ గాంధీ గల మెత్తారని,దేశంలో నిరుద్యోగ అలజడి రేగిందని, ఉద్యోగ అవకాశాలు లేక యువతలో నైరాశ్యం నెలకొందని, యువత మనోవేదనకు తమ పార్టీ అండగా ఉందన్నారు.
పరీక్షల నిర్వహణలో పారదర్శకత రావాలన్నారు. విద్య వ్యవస్థలో సవరణలు జరగాల్సి ఉందని ఆయన తెలిపారు. 22 లక్షల మంది నీట్ విద్యార్థులు పరీక్షకు సిద్ధం కావడం వల్ల లక్ష 32 వేల కోట్లు వ్యయం అయ్యిందని, అయితే కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థకు కేటాయించే 1.40 వేల కోట్ల బడ్జెట్‌కి నీట్ విద్యార్థుల ఖర్చుకు సమానమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేతగానితనం వల్ల పరీక్షల నిర్వహణలో వైఫల్యం చెంది చివరకు విద్యార్థులు నష్టపోయారని ఆయన విమర్శించారు. విద్య, ఉపాధిలో సమాన అవకాశాల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్నదని ఆయన చెప్పారు. యువత భవిత దేశానికి భవిష్యత్ అని అన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఈ నెల 17న కోటాలో ఛాత్రొంకి గుంజా పేరిట రాహుల్ గాంధీ సమావేశం ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ చదువుకున్న డిగ్రీపై స్పష్టత లేదన్నారు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ గుత్తందారులకు కట్టబెడుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.













