హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న వాళ్లకి కాంగ్రెస్ పార్టీలో ఉండే అర్హత లేదని కాంగ్రెస్ ఎంఎల్ఎ వేముల వీరేశం మండిపడ్డారు. సిఎం రేవంత్ రెడ్డిపై కొండా సుష్మితా చేసిన వ్యాఖ్యలకు వీరేశం రీకౌంటర్ ఇచ్చారు. మంత్రి కొండా సురేఖకు నోటీసులు ఇస్తే తన బిడ్డ మాటలకు తనకు సంబంధం లేదని చెప్పడం దారుణమన్నారు. తల్లికి సంబంధం లేకపోతే ఆమె మాటలను కొండా సురేఖ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. కొండా సురేఖ మాట్లాడుతున్న తప్పుడు భాషకు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మూల్యం చెల్లిస్తున్నారని తెలియజేశారు. సురేఖ మాత్రం మంత్రి పదవిని ఎంజాయ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడుతున్నారని వేముల ధ్వజమెత్తారు.  సమంత అంశంలో కొండా సురేఖ మాట్లాడింది తప్పు అని చురకలంటించారు. ఆమె భాష ఎప్పుడూ పార్టీకి నష్టం కలిగించే విధంగానే ఉందని,  సమంత అంశంలో సురేఖ చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ సభ్యులు కానీ, అనామకులైన కొండా సుష్మిత  కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడడం సరికాదన్నారు. రాజకీయ విలువలు కాపాడాలని సురేఖను వేముల కోరారు.