వరంగల్: మంత్రి కొండా సురేఖపై సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. కాసేపట్లో సిఎల్ పిలో 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టనున్నట్టు సమాచారం. సురేఖ కుమార్తె సుష్మిత వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి, టిపిసిసి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మంత్రి కొండా సురేఖకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టడంతో సంచలనంగా మారింది. తనకు సుష్మిత వ్యాఖ్యలకు సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. సంబంధం లేకున్నా కనీసం ఖండించరా అంటూ ఎమ్మెల్యేల సూటిగా ప్రశ్నిస్తున్నారు. సురేఖ వివరణ ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని తిరుగుబాటు ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. కొండా సురేఖ కుటుంబాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తిరుగుబాటు ఎంఎల్ఎలు డిమాండ్ చేస్తున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కొండా సురేఖకు ఇతర కాంగ్రెస్ నాయకులకు మధ్య వివాదాలు చెలరేగుతున్న విషయం విధితమే.  అయితే ఇటీవల కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలను అదునుగా తీసుకుని, కొండా సురేఖ కుటుంబం మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆమె వ్యతిరేక వర్గం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కొండా సురేఖకు వ్యతిరేకంగా ఉన్న వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులంతా నిన్న ప్రత్యేకంగా సమావేశమై కొండా కుటుంబాన్ని సస్పెండ్ చేయాలని తీర్మానం చేసి టిపిసిసికి పంపినట్లు సమాచారం. మరోవైపు తనకు మద్దతు ఇస్తున్న నాయకులకు ఫోన్లు చేసి, మనం కూడా మీటింగ్ పెట్టుకుందామని కొండా సురేఖ చర్చిస్తున్నట్టు సమాచారం.