వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’. రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ హారర్, కామెడీ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 7వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ని వినూత్నంగా ప్రారంభించారు. వరుణ్ తేజ్, హాస్య నటుడు సత్య మధ్య సాగే ఓ సరదా ప్రమోషనల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది.

ఇందులో వరుణ్, సత్య సినిమాలోని విలన్ క్యారెక్టర్ డబ్బింగ్ గురించి మాట్లాడుతుంటారు. ‘‘ఆ విలన్ పాత్ర కోసం నేను ఏకంగా ఓ కొరియన్ నటుడిని రంగంలోకి దించాను. కానీ, అతడి యాక్టింగ్, డైలాగ్ డెలివరీ మరీ సాఫ్ట్‌గా ఉంటుంది. ఇదొక పక్కా కమర్షియల్ సినిమా. విలన్ గట్టిగా అరవాలి. ఎప్పుడూ కోపంగా ఉండాలి’’ అని వరుణ్, సత్యతో అంటాడు. దీంతో, ఆ కొరియన్ నటుడి చేత ఎలాగైనా గట్టిగా అరిపిస్తానని సత్య ఆ కొరియన్ యాక్టర్ దగ్గరలకు వెళ్తాడు. అతను చిరంజీవి ‘ఇంద్ర’ సినిమా చూస్తుంటాడు. అప్పుడు సత్య ‘‘సినిమాలు చూస్తే నీకు నటన రాదు. ఆ ఫీలింగ్ కడుపులో నుంచి రావాలి’ అని చెప్పి ఓ ప్రయోగం చేస్తాడు. చాలా ఘాటైన కడప కిమ్‌చీ కారాన్ని ఆ విలన్‌కి తినిపిస్తాడు. దీంతో ఆ కొరియన్ నటుడు గట్టిగా, కోపంగా అరుస్తాడు. మొత్తానికి రాయలసీయ కారం రుచిని ఇలా వినూత్నంగా చూపించిన ఈ ప్రమోషనల్ వీడియో సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసింది.