న్యూఢిల్లీ: రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, సౌభాగ్యం, విజయాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రేమ, ఐక్యత, పరస్పర విశ్వాసంతో కూడిన బంధం శాశ్వతంగా కొనసాగాలని కోరుకున్నారు. ప్రతి ఏడాది కొనసాగుతున్న సంప్రదాయంలో భాగంగా శుక్రవారం పాఠశాలలకు చెందిన బాలికలు లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని అధికారిక నివాసానికి వెళ్లారు. అక్కడ ప్రధాని మోదీ చేతికి రాఖీలు కట్టారు. చిన్నారులు రాఖీలు కడుతున్న దృశ్యాలతో కూడిన ఫొటోలు, వీడియోను మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

ఈ సందర్భంగా చిన్నారులతో ఆయన ఆప్యాయంగా ముచ్చటించారు. వారితో కరచాలనం చేస్తూ, హై-ఫైవ్‌లు ఇస్తూ ఉత్సాహంగా కనిపించారు. ఓ చిన్నారి మోదీకి ముద్దు పెట్టడం ఆకర్షించింది. ఈ పవిత్ర పండుగ మీ అందరి జీవితాల్లో ఆనందం, సౌభాగ్యం, విజయాలను తీసుకురావాలి అని మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు. చిన్నారులతో తన సరదా సంభాషణకు సంబంధించిన మరో వీడియోను కూడా మోదీ పంచుకున్నారు. రక్షాబంధన్ వేడుకల్లో హై-ఫైవ్‌లు, చిరునవ్వులు.. ఇంకా ఎన్నో మధుర క్షణాలు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి ప్రధాని మోదీని మీ చిన్ననాటి కల ఏమిటి? అని ప్రశ్నించింది. అందుకు మోదీ చిరునవ్వుతో ‘మిమ్మల్ని అందరినీ కలవడం’ అని సమాధానమిచ్చారు.