ప్రముఖ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ ‘ది ఒడిస్సీ’. ప్రపంచదేశాలతో పాటు భారత్‌లోనూ ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూశారు. అందుకు తగినట్లే రికార్డుస్థాయిలో ముందస్తు బుకింగ్స్ అయ్యాయి. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజు భారత్‌లో రూ.20.76 కోట్లు వసూళ్లతో రికార్డు సృష్టించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 39.8 మిలియన్ డాలర్లు (సుమారు రూ.375 కోట్లు) వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

హోమర్ రాసిన ‘ది ఒడిస్సీ’ ఇతిహాసం ఆధారంగా క్రిస్టఫర్ నోలన్ అద్భుత దృశ్య కావ్యంగా దీన్ని తీర్చిదిద్దారు. మాట్ డామన్, టామ్ హాలెండ్, అన్నీ హథవే, రాబర్ట్ ప్యాటిన్సన్, జెండయా కీలక పాత్రల్లో నటించారు. సుమారు రూ.2 వేల కోట్ల బడ్జెట్‌తో కేవలం 91 రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేయడం విశేషం. సినిమా మొత్తాన్ని ఐమ్యాక్స్ 70 ఎంఎం కెమెరాలతో తీయడం గమనార్హం. థియేట్రికల్ అనుభూతిని పంచే మూవీ కావడంతో సినీ ప్రేక్షకులు బాక్సాఫీస్‌కు క్యూ కడుతున్నారు. వీకెండ్ పూర్తయ్యే సరికి ఈ వసూళ్లు రెట్టింపు కావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.