నీటి కేటాయింపులు లేకున్నా.. వరద జలాలు రాకున్నా.. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఎపి ప్రభుత్వం బేసిన్ దాటి కృష్ణా జలాలను యథేచ్ఛగా తరలిస్తుంటే సిఎం రేవంత్ రెడ్డి చోద్యం చూస్తుండటం తెలంగాణకు తీరని ద్రోహం అని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో సాగునీటి కష్టాలు తీవ్రమవుతుంటే.. మరోవైపు ఎపి ప్రభుత్వం తెలంగాణ నీటి హక్కులపై దండెత్తి కృష్ణా జలాలను అడ్డగోలుగా తరలిస్తోందని పేర్కొన్నారు. ఒకవైపు కృష్ణా బేసిన్‌లో భాగమైన బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు నీళ్లు లేక ఆయకట్టులు ఎండిపోతుంటే.. మరోవైపు బేసిన్‌తో సంబంధం లేని ప్రాంతాలకు ఎపి నిబంధనలు ఉల్లంఘిస్తూ, యదేఛ్చగా నీటిని తరలిస్తోందని విమర్శించారు. మాల్యాల, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు, నాగార్జున సాగర్ కుడి కాల్వ.. ఇప్పుడు వెలిగొండ అని వ్యాఖ్యానించారు.

తెలంగాణ వాటా నీటిని ఎపి తరలిస్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదు..? అని ప్రశ్నించారు. రంగారెడ్డి, పాలమూరు, నల్లగొండ సహా తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తీరని ద్రోహం ఇది అని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా నీళ్లను మన పొలాలకు మళ్లించాల్సిన సిఎం రేవంత్ రెడ్డి.. ఎపికి పరోక్షంగా ఎందుకు సహకరిస్తున్నారు..? అని నిలదీశారు. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి వినియోగాన్ని పర్యవేక్షించాల్సిన కెఆర్‌ఎంబి సైతం పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గం అని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన సంస్థే ప్రేక్షకపాత్ర పోషిస్తే.. రాష్ట్ర నీటి హక్కులను ఎవరు కాపాడాలి..? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంటనే స్పందించి, కెఆర్‌ఎంబిపై ఒత్తిడి తెచ్చి, తెలంగాణలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను నింపి, ఆయకట్టుకు నీటి సరఫరా జరిగేలా చూడాలని హరీష్‌రావు బిఆర్‌ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.