పెళ్లంటే పండుగలా చేసుకోవడం.. బంధువుల సందడి.. ఎన్నో సంప్రదాయాలు.. కానీ ఈ తల్లిదండ్రులకు మాత్రం తమ కూతురి పెళ్లిని టీవీలో చూస్తూ ఆశీర్వదించాల్సి వచ్చింది!
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం వేపలసింగారం గ్రామానికి చెందిన జయరాజు, జ్యోతి దంపతులకు హిమబిందు ఒక్కగానొక్క కుమార్తె. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న హిమబిందుకు అక్కడే ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రోహిత్ కుమార్ పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారడంతో.. ఇరు కుటుంబాల అంగీకారంతో ఆగస్టు 29న అమెరికాలో వివాహం చేసుకున్నారు.
కూతురి పెళ్లికి వెళ్లలేకపోయిన తల్లిదండ్రులు.. గ్రామం నుంచే టీవీలో పెళ్లి వేడుకను వీక్షించారు. పెళ్లి ముహూర్తంలో స్క్రీన్ ముందే అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఒక్కగానొక్క కూతురి పెళ్లిని చూస్తూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
అనంతరం గ్రామంలో బంధువులు, అతిథులకు ఘనంగా పెళ్లి విందు ఏర్పాటు చేశారు. కూతురు దూరంగా ఉన్నా.. ఆమె పెళ్లి ఆనందాన్ని ఊరంతా పంచుకున్న ఈ తల్లిదండ్రుల ప్రేమ అందరినీ కదిలించింది!












