ఈమధ్య వార్తాపత్రికలు చూస్తుంటే చాలా తరచుగా అవినీతి తిమింగలాలు పట్టుబడుతున్న సందర్భాలు అనేకం చదువుతున్నాం. వందల కోట్ల ఆస్తి, బంగారం, వెండి, ప్లాట్లు, ఇళ్లస్థలాలు లాంటి వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు కొన్నిసార్లు బినామీలపై డాక్యుమెంట్లు లభించడం జరుగుతున్నది. ఒక వ్యక్తి తాను ఉద్యోగం చేసేది 30, 35 సంవత్సరాల వరకు ఉండవచ్చు. అన్ని ఏళ్లలో నిజాయితీగా పనిచేసిన ఒక ఉద్యోగి ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా అతని జీతభత్యాలు ఐదు కోట్లకు చేరితే మహా గొప్ప. కానీ వందల కోట్లు ఏ విధంగా సంపాదిస్తున్నారు? అది కేవలం ప్రజల రక్తం పీల్చి సంపాదిస్తేనే వందల కోట్ల రూపాయల సంపాదన సాధ్యమవుతుంది. ఈమధ్య అఖిల భారత సర్వీసు అధికారులు కూడా మేమేం తక్కువ తిన్నాం అన్నట్లు వారి చేతనైన మేరలో వ్యవస్థ కన్ను కప్పి అవినీతికి పాల్పడుతున్నారు.ఆ మధ్య ఒక న్యాయమూర్తి ఇంట్లో కోట్లాది విలువైన రూపాయల కట్టలు దగ్ధమైనాయి. అంటే ఈ అవినీతి జబ్బు న్యాయవ్యవస్థకు కూడా అంటిందన్నమాట. దొరకని వారు దొరలుగా చలామణి అవుతున్నారు. రాజకీయ అవినీతి ఈ దేశానికి పట్టిన వదలని చీడ. దానికి ఏ రకమైన మందులు పనిచేయడం లేదు. ఏ ప్రభుత్వ కాంట్రాక్టు అయినా వారి ప్రమేయం వారి కమిషన్లు లేకుండా జరగడం లేదు.

అందుకే వార్డు సభ్యుడు సైతం విలాసవంతమైన ఇన్నోవా కార్లలో తిరగడం చూస్తున్నాం. ఈ రోజుల్లో డబ్బు సంపాదించాలంటే కాంట్రాక్టులు రాజకీయాలు తప్ప మరి ఏవీ పనికి రాకుండాపోయాయి. ఇన్ని వ్యవస్థలను స్ఫూర్తిగా తీసుకున్న ఓటరు (అతడు కూడా ఈ వ్యవస్థలో భాగమే) తాను కూడా ఓటుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. కానీ అతడికి ఆ అలవాటు చేసింది మాత్రం మన రాజకీయ నేతలే. అంటే అవినీతి ఈ వ్యవస్థలో ఒక చైన్ లేదా ఒక చక్రం లాగా నడుస్తున్నదని అర్థమవుతున్నది. మంచి శాఖలలో ఉన్నత స్థాయిలో పనిచేస్తూ ప్రజలకు సేవలు అందించి తమ జీతానికి న్యాయం చేయవలసిన అధికారులు డబ్బు కక్కుర్తికి అలవాటు పడ్డారు. ఒక రవీందర్, ఒక సతీష్, ఒక మోహన్ నాయక్, ఒక నరహరి రావు, ఒక భీమిరెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా కొండవీటి చేతాడు అవుతుంది. గత ఎనిమిది నెలల్లో అవినీతి నిరోధక శాఖ జరిపిన దాడులలో 44.33 కోట్ల ఆస్తులను వెలికి తీసింది. 179 కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది. డబ్బులు కట్టలు ఇళ్లలో గుట్టలుగా దర్శనమిచ్చిన సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్ విభాగాల్లో పనిచేసేవారు, రెవెన్యూ, పోలీసు శాఖల వారికి ఈ అవినీతి మకిలి బాగా అంటుకున్నది. ప్రతి పనికి కొంతమంది రేట్లు నిర్ణయిస్తున్నట్లు తెలిసింది. రిజిస్ట్రేషన్, రవాణా, వైద్య శాఖలు కూడా అవినీతిలో తామేమి తీసిపోనట్లు నిరూపించుకుంటున్నాయి. ఈ అక్రమార్జనను రెసిడెన్షియల్ ఫ్లాట్స్, ఇళ్లస్థలాలు, బంగారం, వెండి కొనడానికి ఇంకా బినామీ దారుల పేర్లపై కూడా ఇల్లు కొనిపెడుతున్నారు. అంటే డబ్బు దాచుకోవడానికి అనేక మార్గాలు వెతుక్కుంటున్నారు. ఈమధ్య ఉత్తరప్రదేశ్‌లో ఒక అవినీతి అధికారి ఇంట్లో సోదాలు జరుపగా ఆయన ఇంటిగోడలు సరిగా లేకపోవడం చూసి అధికారులకు అనుమానం వచ్చి గోడలను పగలగొట్టగా వాటిలో నుండి నోట్ల కట్టలు బయటపడ్డాయి. అయోధ్య రామాలయంలో దొంగిలించిన సొమ్మును నిందితులు టాయిలెట్లలో, ఇంకా ఆవుపేడ కుప్పల కింద కూడా దాచిపెట్టారట. నీతి తప్పి సంపాదించితే దాచిపెట్టడం కూడా కష్టమే. నీతిగా నిజాయితీగా సంపాదించే వాడికి దాచుకోవడానికి ఏమీ ఉండదు. జీవించడం కోసం ధనం సంపాదించడం పోయి ధనం సంపాదించడం కోసమే కొందరు జీవిస్తున్నట్లుగా ఉంది.

ఇలాంటి వారి వల్లే ప్రజల్లో ఉద్యోగులంటే అవినీతిపరులని, డబ్బు ముట్టనిదే వారు పని చేయరని ఒక చులకన భావం ఏర్పడింది. అందువలన ఉద్యోగ వర్గం మొత్తం ఆత్మరక్షణలో పడుతున్నది. ఉద్యోగుల పట్ల, వారి సమస్యల పట్ల ప్రజలలో సానుభూతి కొరవడింది. కొన్ని సందర్భాలలో వారు ప్రైవేటీకరణను కూడా సమర్థించడానికి కారణం కేవలం ప్రభుత్వ వ్యవస్థలలో పేరుకుపోయిన అవినీతి ఇంకా అలసత్వం. వారిలో జవాబుదారీతనం లోపించడమే. లంచం తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా నేరమే. కానీ చిన్న పని కోసం కూడా పలుమార్లు పనులు చెడగొట్టుకొని ఖర్చు పెట్టుకుని తిరగడం తప్పించుకోవడానికి ప్రజలు లంచాలు ఇస్తున్నారు. దీన్నే ఆసరాగా తీసుకుని కొంతమంది అధికారులు లంచాలు డిమాండ్ చేస్తున్నారు. అవినీతి అతిగా వేళ్లూనుకొని ఉండబట్టే భారతదేశం ప్రపంచంలోనే 182 దేశాల్లో 91వ స్థానంలో ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం దేశంలోని అత్యధిక అవినీతివంతమైన ఐదు రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. వచ్చే జీతం రాళ్లతో ప్రస్తుత కుటుంబ పోషణ ఒక మామూలు ఉద్యోగికి అసాధ్యం ఏమీ కాదు. ఎప్పుడైతే తమ కోసం కాకుండా రాబోయే తరాల కోసం సంపాదించాలనుకుంటారో వారు అక్రమ మార్గాలను ఆశ్రయిస్తారు. రాబోయే తరాలకు కూడా ఇల్లు, బంగారం, వెండి, ప్లాట్లు కొనిపెట్టడానికి ఈ అక్రమార్జన. చిన్న, చితకా కేసులు అవినీతి నిరోధక శాఖ దృష్టికి పోకుండానే పరిష్కారం అవుతాయి. ఒకటి లేదా రెండు శాతం ఉద్యోగులపై కూడా ఎసిబి దాడులు జరగడం లేదు. కానీ అందులో 10% మందిపై కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు రావడం లేదు. అందుకే ఉద్యోగులకు అవినీతికి పాల్పడడానికి భయం లేకుండా పోయింది.

అవినీతి వ్యవస్థీకృతమవుతున్నది. పైస్థాయి నుండి కింది వరకు లంచం ‘మామూలై’పోయింది. యువకులుగా ఉంటూ ఎన్నో ఆదర్శాలు వల్లిస్తున్నవారు ఉద్యోగం వచ్చిన కొద్ది కాలానికే అధికార లాలసకు, అవినీతి ఫలాలకు అలవాటు పడడం చూస్తున్నాం. ఇప్పుడు అవినీతికి పాల్పడని ఉద్యోగిని ప్రజలు అనుమానంగా చూసే రోజులు వచ్చాయి. ఇతడు పనిచేసే వాడేనా అని చాటుగా అనుకుంటున్నారు. దానిని ఇప్పుడు చాలా అందంగా హుందాగా ‘ఫార్మాలిటీస్’ అని పిలుస్తున్నారు. ఈ సొమ్ము నా ఒక్కడికే కాదండి, ఇందులో ఆఫీసులో అందరూ భాగస్వాములే అంటూ అవినీతిని అందరికీ అంటకడుతున్నాడు. నోట్ల కట్టలు బ్యాంకులు, లాకర్లు దాచలేనంత డబ్బు, మంచం పరుపు కింద గోడలలో కూడా దాచుకునే డబ్బు ఒక వ్యక్తి జీవితానికి అవసరమా? డబ్బు లేని జీవితం అంత పనికిమాలినదా? సక్రమంగా చట్టబద్ధంగా రావలసిన కావలసిన పనులకు కూడా లంచాలు ఇవ్వవలసి వస్తున్న పరిస్థితుల్లో ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థపై విశ్వాసం కొరవడుతున్నది. విముఖత పెరుగుతున్నది. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు ప్రమాదకరమైన సంకేతంగా పరిగణించాలి. అత్యాశ ఉద్యోగులకు శాపంగా పరిణమించాలి. అవినీతి మహావృక్షాన్ని కూకటి వేళ్ళతో పెకిలించి సమాజాన్ని రక్షించవలసిన బాధ్యత అందరి పైన ఉంది.


శ్రీ శ్రీ కుమార్