
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లా కెల్లామ్ ఏరియాలో శుక్రవారం సాయంత్రం ఉగ్రదాడి జరిగింది. వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన ఈ కాల్పుల్లో ఇద్దరు వలస కార్మికులు తీవ్రంగా గాయపడటంతో వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించగా, మరొకరని మెరుగైన వైద్య చికిత్స కోసం అనంతనాగ్‌లోని ప్రభుత్వ వైద్య కాలేజీ (జీఎంసీ)కి తరలించారు. ఈ ఇద్దరినీ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దీపక్, భూపేంద్ర కుమార్‌గా గుర్తించామని, దీపక్ ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించగా, భూపేంద్ర కుమార్ చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. కాగా, ఈ దాడి అనంతరం భద్రతా బలగాలు ఘటనా స్థలికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.











