
మనిషిని పట్టిపీడిస్తున్న ప్రధాన రోగాలలో క్యాన్సర్ ది అగ్రస్థానం. వయసు మళ్లినవారే ఒకప్పుడు ఈ వ్యాధి బారిన పడేవారు. ఈ నమ్మకాన్ని వమ్ము చేస్తూ, ఇప్పుడు ముక్కుపచ్చలారని చిన్నారులను సైతం ఈ మహమ్మారి కాటేస్తోంది. రకరకాల క్యాన్సర్లు మనిషిని నిలువునా కబళిస్తుంటే, వైద్యరంగం సైతం చేష్టలుడిగి చూస్తూ ఉండిపోవలసిన దుస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. క్యాన్సర్ వ్యాధి వ్యాప్తి చెందుతున్నంత వేగంగా వైద్య పరిశోధనలు వేగం పుంజుకోకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురిలో ఒకరు తమ జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు క్యాన్సర్ బారినపడే ప్రమాదం ఉందంటూ క్యాన్సర్‌పై గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఇటీవల కళ్లకు కట్టిన విషయం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.
అయితే, ఇంతటి విషమ పరిస్థితిలోనూ ఎడారిలో ఒయాసిస్సులా.. తాజాగా వెలుగు చూసిన రెండు వైద్య పరిశోధనలు క్యాన్సర్ రోగులకు శ్రవణపేయం కలిగిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. క్యాన్సర్ వైద్య చికిత్సలో భాగమైన కీమోథెరపీకి బదులుగా ఆర్‌కె 251 అనే ఒక కొత్త రకం ఔషధం త్వరలో అందుబాటులోకి రానున్నట్లు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించడం వాటిలో ఒకటి కాగా, రెండవది మెలనోమా అనే ఒక రకమైన చర్మ క్యాన్సర్ తిరగబెట్టకుండా వైద్య పరిశోధకులు టీకాను అభివృద్ధి చేశారనేది రెండవది. క్యాన్సర్ కణాల వ్యాప్తిని అరికట్టడంతోపాటు వాటిని నిర్వీర్యం చేయడంలో కీమోథెరపీ తిరుగులేని వైద్య విధానమే అయినా, వాటితోపాటు ఆరోగ్యకరమైన కణాలు సైతం నశిస్తాయన్నది కాదనలేని నిజం.
రోగనిరోధక శక్తి తగ్గడం, రక్తహీనత వంటి దుష్పరిణామాలు తలెత్తడమూ కద్దు. దీనికి ఇమ్యునోథెరపీ, హార్మోన్ థెరపీ వంటి ప్రత్యామ్నాయ వైద్య విధానాలు ఉన్నప్పటికీ అవి కీమోథెరపీ అంతటి ప్రభావవంతమైనవి కాకపోవడంతో నిపుణులు ఈ వైద్య విధానంపైనే ఆధారపడుతున్నారు. తాజాగా భారతీయ శాస్త్రవేత్తలు కనుగొన్న ఆర్‌కె 251 ఔషధం అందుబాటులోకి వస్తే ఇక కీమోథెరపీ అవసరం ఉండదన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటన క్యాన్సర్ రోగులకు కొండంత ఊరట. ప్రీ క్రినికల్ ట్రయల్స్‌లో ఆశాజనకమైన ఫలితాలను అందించిన ఈ ఔషధం వీలైనంత త్వరగా మార్కెట్ లోకి వస్తే, కీమోథెరపీకి వైద్యులు చెల్లుచీటీ పాడే అవకాశం ఉంటుంది. ఇక అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ మోడెర్నా.. చర్మ క్యాన్సర్ వ్యాధిగ్రస్థులకు టీకా రూపొందించడం మరొక కీలక పరిణామం. మెలనోమా అనే చర్మ క్యాన్సర్‌ను అరికట్టేందుకు రూపొందించిన ఈ టీకాను వేయించుకున్న బాధితుల్లో వ్యాధి తిరగబెట్టే ముప్పు, మరణించే ప్రమాదం 50 శాతం వరకూ తగ్గినట్లు పరిశోధనల్లో తేలిందట.
అయితే ఇది వ్యాధి రాకుండా నివారించే టీకా కాకపోవడం గమనార్హం. అలాగే ఇది ఇతర టీకాల మాదిరి రోగులందరికీ సామూహికంగా వినియోగించే టీకా కూడా కాదు. వ్యాధిగ్రస్థుడి క్యాన్సర్ కణుతుల్లో మార్పులను బట్టి ఎవరికి వారికి వ్యక్తిగతంగా తయారు చేసే టీకా కావడం వల్ల రోగులకు ఎంతవరకూ ఉపయోగకరంగా ఉంటుందనేది సందేహం. రోగి వ్యాధి లక్షణాలను బట్టి టీకా తయారు చేయాలి కాబట్టి అందుకు పట్టే సమయం, అయ్యే ఖర్చు వంటి వాటిపై స్పష్టత కోసం మరికొంత కాలం వేచిచూడక తప్పదు. ఏదిఏమైనా ఈ రెండు ఆవిష్కరణలూ వైద్య పరిశోధనా రంగానికి కొత్త ఉత్సాహాన్నిస్తాయనడంలో సందేహం లేదు. ప్రపంచంలోనే అత్యధిక జనాభాతో కిటకిటలాడుతున్న భారతావని క్యాన్సర్ కేసుల నమోదులో చైనా, అమెరికాల తర్వాత మూడో స్థానంలో ఉంది.
ముఖ్యంగా రొమ్ము, గర్భాశయ, నోటి క్యాన్సర్లు భారతీయుల ఉసురు తీస్తున్నాయి. రోజుకో రకం క్యాన్సర్ వెలుగు చూస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య పరిశోధనలు మరింత ముమ్మరం కావలసిన అవసరం ఉంది. అమెరికా, చైనా, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ దిశగా జరుగుతున్న కృషి అంతంత మాత్రమే. ఔషధాలు, వ్యాక్సీన్ల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామి దేశాలలో ఒకటిగా ఉన్న భారత్.. వైద్య పరిశోధనల విషయంలో మాత్రం వెనుకబడే ఉంది. నిపుణులైన వైద్యులకూ, శాస్త్రవేత్తలకూ కొదవ లేకపోయినా ప్రభుత్వపరంగా పరిశోధనలకు అవసరమైన చేయూత, నిధుల కేటాయింపులో ఉదాసీన వైఖరే దీనికి కారణం. ఈ పరిస్థితిలో మార్పు వస్తే, వైద్య పరిశోధనలలోనూ విప్లవాత్మకమైన ఆవిష్కరణలకు భారతీయ వైద్య నిపుణులు శ్రీకారం చుడతారనడంలో సందేహం లేదు.











