మన తెలంగాణ/హైదరాబాద్: ‘క్యూర్’ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల కోసం మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం గాంధీ భవన్‌లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్ల వంటి సమస్యలపైనే ప్రజల నుంచి అధికంగా వినతి పత్రాలు వచ్చాయన్నారు. అయితే ‘క్యూర్’ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్లు కోరుకునే వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచన మేరకు ప్రతి బుధవారం ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. గతంలో బిఆర్‌ఎస్ అధికారంలోకి ఉన్నప్పుడు మంత్రులు అందుబాటులో ఉండేవారు కాదన్నారు. పేదవారి  ఆత్మగౌరవానికి చిహ్నమైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం చేపట్టిందని ఆయన తెలిపారు. ఈ ప్రభుత్వ హయాంలోనే తమ సొంతింటి కల నెరవేరుతుందన్న ఆశతో పేదలు ఉన్నారని ఆయన చెప్పారు. వారి ఆశలకు అనుగుణంగా తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టిందన్నారు. మొదటి విడతలో 4.50 లక్షలు, రెండో విడతలో 2.50 లక్షలు, మొత్తం 7 లక్షల ఇండ్లు మంజూరు చేసిందని ఆయన తెలిపారు.

ఇంటి విలువ కోటి వరకూ..

గడిచిన పది సంవత్సరాల్లో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం అరకొరగా నగరానికి 30-40 కిలో మీటర్ల దూరంలో ఇండ్లు నిర్మించింందని, దీంతో తమ జీవనోపాధి దెబ్బతింటుందని భావించిన పేదలు ఆ ఇండ్లలో కాలు కూడా పెట్ట లేదని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా పేదవాడు పుట్టి పెరిగిన చోట నివాసం కల్పించాలన్న ఆలోచనతో నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకొని ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నామని ఆయన వివరించారు. ఇప్పుడు నిర్మించబోయే ఇండ్ల విలువ 40 లక్షల నుంచి కోటి రూపాయిల వరకు ఉంటుందన్నారు. అంతేకాకుండా ఇంటి స్థలంలో వాటా కూడా కల్పిస్తున్నామని ఆయన చెప్పారు.పైలట్ ప్రాజెక్టుగా 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్ నిర్మిస్తున్నామని తెలిపారు. గతంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఈ ఇండ్ల కోసం మీ సేవ, వాట్సాప్, వెబ్‌సైట్ ద్వారా మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భూములకు సంబంధించి వచ్చిన దరఖాస్తుల్లో పరిష్కరించగలిగిన అన్నింటికీ పరిష్కారం చూపిస్తామని ఆయన వివరించారు.


దేశంలో యువత భవిష్యత్తును దెబ్బ తీసిన నీట్ పరీక్ష లీకేజిపై శాంతియుతంగా ఢిల్లీలో ధర్నా చేస్తున్న యువతపైన, మద్దతు తెలిపిన కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై లాఠీ ఛార్జి చేయడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. ప్రతిపక్షాలకు సరైన సమాధానం చెప్పలేక పార్లమెంటును పలుమార్లు వాయిదా వేసుకోవడం, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడం కేంద్ర ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏఐసిసి పిలుపు మేరకు హైదరాబాద్‌లో నిరసన ర్యాలీ నిర్వహించామని ఆయన తెలిపారు. నీట్ పరీక్షకు హాజరైన ఇరవై రెండు లక్షల మంది అభ్యర్థులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఃః==ఃః