
మన తెలంగాణ/హైదరాబాద్: ఈ ఏడాది డిసెంబర్‌లో ‘ఖేలో ఇణడియా యూత్ గేమ్స్’ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి, ఈ మేరకు రూ.22 కోట్లు విడుదల చేసినందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదని ఆయన బుధవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ వేదికలుగా క్రీడా పోటీల నిర్వహణ జరుగుతుందన్నారు. దేశం నలుమూలల నుంచి 6 వేలకు పైగా క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. గురువారం దేశవ్యాప్తంగా ‘ఖేల్ కీ బాత్, పీఎం కే సాథ్’ పేరుతో ఖేలో ఇండియా సంవాద్ జరుగుతుందని, యువ క్రీడాకారులతో వర్చువల్‌గా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడనున్నారని ఆయన తెలిపారు.
దేశ యువ శక్తికి సరైన క్రీడా సదుపాయాలను, అవసరమైన ప్రోత్సాహాన్ని కల్పించి వారిలోని శక్తిసామర్థ్యాలకు పదును పెట్టడంతో పాటుగా వారికి క్రీడారంగంలో ఉజ్వలమైన భవిష్యత్తును అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోందన్నారు. దీని కోసం గత 12 ఏళ్లుగా వివిధ కార్యక్రమాలను, పథకాలను తీసుకొచ్చిందని, ఇందులో భాగంగానే ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం ద్వారా దేశంలోని యువ క్రీడా శక్తిని ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా.. ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’, ‘ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్’, ‘ఖేలో ఇండియా పారా గేమ్స్’, ‘ఖేలో ఇండియా వింటర్ గేమ్స్’, ‘ఖేలో ఇండియా బీచ్ గేమ్స్’,‘ఖేలో ఇండియా వాటర్ స్పోరట్స్ ఫెస్టివల్’, ‘ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్’ వంటి క్రీడా పోటీల నిర్వహణ ద్వారా క్రీడాకారులు తమలో దాగిఉన్న క్రీడా ప్రతిభను, తమలోని నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి
ఒక వేదికను ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన 24 ఎడిషన్ల ‘ఖేలో ఇండియా ’ పోటీల్లో దేశం నలుమూలల నుంచి 60 వేల మందికి పైగా క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారని ఆయన చెప్పారు.ఈ ఏడాది జరగనున్న 8వ ఎడిషన్ ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ను తెలంగాణలో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వాలు క్రీడలకు సరైన నిధులు కేటాయించకుండా నిర్లక్షం చేశారని ఆయన విమర్శించారు. 2014లో కేంద్రంలో తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత క్రీడలకు బడ్జెట్ కేటాయింపులు పెరిగాయని, ఖేలో ఇండియా వంటి పథకాల ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాలలో ఉన్న క్రీడా ప్రతిభకు సరైన ప్రోత్సాహం లభిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.











