ప్రధాని మోడీని ఉగ్రవాదిగా పేర్కొనడంపై కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గేకు ఎన్నికల సంఘం బుధవారం తీవ్రస్థాయి నోటిసు వెలువరించింది. తమిళనాడు , పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఒక్కరోజు ముందు ఎన్నికల సంఘం ఘాటుగా స్పందించింది. చెన్నైలో విలేకరుల సమావేశం దశలో ఖర్గే ప్రధాని మోడీ టెర్రరిస్టు వంటి వారని విమర్శించారు. ప్రతిపక్షాల అణచివేతకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికార యంత్రాంగాలను వాడుకొంటోందని, ఈ క్రమంలో ఆయన టెర్రరిస్టు వంటి వారేనని ఖర్గే తెలిపారు. దీనిని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఖర్గేకు నోటిసు ఇస్తూ దీనికి 24 గంటల్లో సమాదానం ఇచ్చుకోవల్సి ఉందని హెచ్చరించింది. ప్రజలను, పార్టీలను తన చర్యలతో భయభ్రాంతులను చేస్తున్న వ్యక్తి టెర్రరిస్టు కాక మరెవ్వరు అని ఖర్గే ఆ తరువాత వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఈసికి ఆయన ఎటువంటి జవాబు ఇస్తారనేది చూడాల్సి ఉంది.