కొంత కాలంగా నగరాల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా ఆపార్ట్ మెంట్ నాగరికత పెరిగిపోతోంది. దీనికి తోడుగా అంతస్తులు పెరిగిపోవడంతో ఎవరైనా మెట్ల ద్వారా తమ ఫ్లోర్‌కు వెళ్లే పరిస్థితులు తగ్గిపోయాయి. లిఫ్ట్‌లు పని చేయకపోతే కాలమే స్తంభించిపోతోంది. తీరిక లేకుండా లిఫ్ట్‌లు పైకి కిందికి కదలడం వల్ల వాటి జీవితకాలం కూడా తగ్గిపోతోంది. యాంత్రిక లోపాలు ఏర్పడడం, మీటలకు అనుగుణంగా కదలక అవి మొరాయించడం ఈ రోజుల్లో సర్వసాధారణమైన పోయింది. అయితే వాటిని ఎవరు తీవ్రమైన సమస్యగా పరిగణించడం లేదు. 20, 30 ఏళ్లనాటి అపార్ట్‌మెంట్‌లలో ఊగిసలాడే, గరగర శబ్దం చేసే లిఫ్ట్‌లు కదులుతూనే ఉంటాయి. వాటిని ఎక్కాలంటేనే భయమేస్తుంది. దాదాపుగా అంతటా పాత లిఫ్ట్‌లను ఏదో చిన్నపాటి మరమ్మత్తుతో నెట్టుకొస్తుంటారు. ఇలా సరైన నిర్వహణ లేనప్పుడు అవి దెబ్బ తిని పెను ప్రమాదాలకు దారి తీస్తున్నాయి.

లిఫ్ట్ ప్రమాదాల వల్ల గాయపడడమే కాకుండా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. లిఫ్ట్ క్యాబిన్ రాక ముందే తలుపు తెరుచుకోవడం వల్ల అందులోకి వెళ్లి కిందపడి చనిపోయిన వారున్నారు. హైదరాబాద్‌లో ఓ చోట ఆరవ అంతస్తు నుండి లిఫ్ట్ కింద పడిపోవడంతో ఒకరు చనిపోయారు. లిఫ్ట్ లోపలి వెళుతుండగానే అది కదలడంతో చనిపోయిన సంఘటన బెంగుళూరులో జరిగింది. ముంబైలోని ఓ బిల్డింగ్‌లో 25 వ అంతస్తు నుండి లిఫ్ట్ కూలిపోయింది. ఈ మధ్య కరీంనగర్‌లోని ఓ హాస్పిటల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఒకటవ అంతస్తు నుండి కిందికి రావడానికి ఎక్కిన లిఫ్ట్ నేలపై కుప్పకూలింది. ఒక్కసారిగా అందరు షాక్‌కు గురైనా ప్రమాదమేమీ జరగలేదు. లిఫ్ట్‌ల వాడకం పెరిగిపోవడంతో వాటి ద్వారా సంభవించే ప్రమాదాల సంఖ్య కూడా ఏడాదికేడాది పెరిగిపోయింది.

అయితే లిఫ్ట్ ప్రమాదం వల్ల గాయపడడం లేదా మరణించిన సంఘటనలకు ఎవరు బాధ్యులు అనే విషయంపై ఇంతవరకు ఖచ్చితమైన చర్చ ఎప్పుడు జరగలేదు. అనుకోకుండా జరిగిన ప్రమాదానికి బాధితుడు బలి కావలసిందే తప్ప ఒకరిని దోషిగా నిలబెట్టే పరిస్థితులు లేవు. గాయపడినవారు సొంతంగానే చికిత్స చేయించుకునేవారు. చనిపోతే ఆ హత్యా నేరం ఎవరిపైనా మోపడం జరిగేది కాదు. ఇంతకాలం సాగుతున్న ఈ విధానానికి 30, జులైన సుప్రీంకోర్టు తన తీర్పుతో ముగింపు పలికింది. న్యూఢిల్లీలో మార్చి 2003లో లిఫ్ట్ ప్రమాదంలో మరణించిన విపిన్ హందా కుటుంబీకులు వేసిన కేసుకు 23ఏళ్ల తర్వాత న్యాయం దక్కింది. లిఫ్ట్ వైఫల్యం వల్ల మరణించిన వ్యక్తి బంధువులకు 9% వడ్డీ కలిపి రూ. 3 కోట్లు చెల్లించాలని ఈ తీర్పులో ఉంది. మూడు నెలల్లో చెల్లించకపోతే వడ్డీ 12%కి మారిపోతుంది. ప్రమాదానికి బాధ్యులుగా లిఫ్ట్ తయారీ పరిశ్రమను, నిర్వహణా సంస్థను, బిల్డింగ్ యజమానులను దోషులుగా ప్రకటించింది. ఆ జరిమానాను ఏ ఒక్క సంస్థగానీ లేదా కలిసి గాని బాధితుని కుటుంబానికి చెల్లించాలని తీర్పులో ఉంది. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార చట్టంలో ఉన్నట్లుగానే 70%, 25%, 5% చొప్పున లిఫ్ట్ కంపెనీ, నిర్వాహకులు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్ ఈ జరిమానాను చెల్లించవచ్చు అని పేర్కొంది. న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, అలోక్ రాధే గల బెంచి వెలువరించిన ఈ తీర్పులో వారు చాలా విషయాలు ప్రస్తావించారు.

రోజూ లక్షల మంది ప్రతిరోజూ ఎలివేటర్‌లను ఉపయోగిస్తున్నారు. వాటిని వాడేవారు అవి తమని సురక్షితంగా గమ్యస్థానాలకు తీసుకువెళ్తాయి అనే నమ్మకంతో ఉంటున్నారు. లిఫ్ట్ ప్రమాదం, వైఫల్యం తీవ్రమైన నేరం అని బాధ్యులందరికీ అర్థం కావాలి. ఈ తీర్పు బాధితులకు ఒక చట్టపరమైన హామీ కావాలి. లిఫ్ట్‌ని రవాణా వాహనంగా కోర్టు పేర్కొంది. గమ్యం చేరేదాకా ప్రయాణికుల భద్రతకు వాహన యాజమాన్యం బాధ్యత వహించినట్లు లిఫ్ట్‌లో వెళ్లేవారు సక్రమంగా కోరుకున్న ఫ్లోర్‌లో దిగేదాకా ఈ మూడు సంస్థలే చూసుకోవాలి ఈ తీర్పులో అత్యంత ముఖ్యమైన భాగం ఏమిటంటే నష్టపరిహారం కోరే ముందు బాధితుడు అసలు తప్పు ఎవరిదో గుర్తించాల్సిన అవసరం లేదు. ఈ మూడు సంస్థల్లో ఎవరినుంచైనా నష్టపరిహారం కోరవచ్చు. మిగతా రెండింటితో అది సంప్రదించి తమ బాధ్యత వాటాలను పరిష్కరించుకోవాలి. గతంలో తప్పు మీదంటే, మీది అని వీటి మధ్య సయోధ్య కుదరక కేసు విచారణ, తీర్పులు ఆలస్యమయ్యేవి. ఇంతకాలం బాధితులు ఎదుర్కొన్న ప్రధాన అడ్డంకి ఈ తీర్పుతో తొలగిపోయింది. లిఫ్ట్ వాడేవారికి కూడా న్యాయస్థానం కొన్ని సూచనలు చేసింది. నిర్వాహకులు పేర్కొన్న నిబంధనలు, సూచనలను తప్పక పాటించాలి.

లిఫ్ట్ సామర్థ్యానికి మించి ఎప్పుడూ ఓవర్‌లోడ్ చేయవద్దు. బలవంతంగా తలుపులు తెరవవద్దు. అంతస్తుల మధ్య ఇరుక్కున్న లిఫ్ట్ నుండి బయటికి రావడానికి ప్రయత్నించవద్దు. చిక్కుకున్నట్లయితే అలారం బటన్ లేదా ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ సిస్టమ్‌ని ఉపయోగించాలి. కొత్తశబ్దాలు, కుదుపులు వచ్చినపుడు వాడకం ఆపేయాలి. ఈ జాగ్రత్తలు జరగబోయే ప్రమాదాలను నివారిస్తాయి. ఈ తీర్పుతో తయారీదారులు, నిర్వహణ కాంట్రాక్టర్లు, భవన యజమానులు అప్రమత్తత కావలసిన అవసరం ఉంది. ఇక నుంచి లిఫ్ట్ నిర్వహణ విషయంలో ప్రతి వాటాదారు దాని సర్వీస్ కాలమంతా సురక్షితంగా ఉండేలా చూసుకోవడానికి చట్టపరమైన బాధ్యతను తీసుకోవలసిందే. ప్రభుత్వం కూడా అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌ల నిర్వహణపై కన్నేయాలి. టెక్నీషియన్ ధ్రువీకరణ తప్పనిసరి చేయాలి. తనిఖీలు చేసి లోపాలు కనబడిన లిఫ్ట్‌ల వాడకాన్ని నిరోధించేలా వాటికి తాళం వేయాలి. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించాలి. లిఫ్ట్ ప్రమాదాలకు ఎవరిని బాధ్యులు చేయాలో వాడకందారులకు అర్థమయ్యేలా ఈ తీర్పు పాఠం విస్తృత ప్రచారం కావాలి.  

బద్రి నర్సన్ 9440128169