న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ అంశంపై లోక్‌సభలో సుదీర్ఘ చర్చ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను పార్లమెంట్‌లో కలిశారు. అధికారుల సమాచారం ప్రకారం, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై సమగ్ర చర్చ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని లోక్‌సభలో ప్రకటించిన అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ స్పీకర్‌ను కలిసి చర్చించారు. చర్చను ఏ నిబంధన కింద నిర్వహించాలి, ఎప్పుడు చేపట్టాలి, ఎంతసేపు కొనసాగించాలనే అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పీకర్ ఓం బిర్లాను కోరినట్లు సమాచారం.

ఉదయం సభ వాయిదా అనంతరం మధ్యాహ్నం తిరిగి సమావేశమైన వెంటనే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజును ప్రకటన చేయాలని స్పీకర్ ఆదేశించారు. అయితే కాంగ్రెస్ నేత కే.సీ. వేణుగోపాల్ జోక్యం చేసుకుని, నీట్ వ్యవహారంపై చర్చతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కూడా ప్రతిపక్షం డిమాండ్ చేస్తోందని స్పష్టం చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్షల నిర్వహణలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై లోక్‌సభలో విసృ్తత చర్చ జరపాలని ప్రతిపక్షం గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తోంది. అలాగే ఈ వివాదాన్ని సమర్థంగా ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కూడా కోరుతోంది.