
ఉప్పల్ రింగ్‌రోడ్డుపై ట్రాఫిక్ నిలిపివేత
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు.. వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తరలింపులో పోలీసుల సమయోచిత స్పందన
మన తెలంగాణ/ఉప్పల్: వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర గుండెపోటుకు గురికావడంతో ఆయనను అత్యవసర చికిత్స కోసం వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. వరంగల్‌లోని స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్ నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. రోగి ప్రాణాలను కాపాడటమే పరమావధిగా భావించిన పోలీసులు తక్షణమే స్పందించి ఉప్పల్ రింగ్‌రోడ్డు పరిసర ప్రాంతాల్లో గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. అంబులెన్స్ ప్రయాణించే మార్గంలో ఇతర వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసి, ఎక్కడా ట్రాఫిక్ నిరోధం లేకుండా నిరంతర క్లియర్ మార్గాన్ని (క్లియర్ రూట్ ) సుగమం చేశారు.
మల్కాజ్ గిరి కమిషనరేట్ ఉప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు, స్థానిక పోలీసుల అద్భుత సమన్వయం వల్ల అంబులెన్స్ అత్యంత వేగంగా ఆస్పత్రికి చేరుకోగలిగింది. అత్యవసర సమయాల్లో 'గ్రీన్ కారిడార్' ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందో ఈ సంఘటన మరోసారి నిరూపించింది. సమయానికి వైద్యం అందేలా సహకరించిన పోలీసుల చొరవను పలువురు అభినందించారు.
- ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి
ఈ సందర్భంగా మల్కాజ్ గిరి ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. రోడ్డుపై అంబులెన్స్ శబ్దం వినపడగానే వాహనదారులు మానవత్వంతో స్పందించి, మార్గం సుగమం చేయాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో సెకన్లు కూడా ప్రాణప్రదమని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అంబులెన్స్‌లకు దారి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.











