
పాట్నా: బీహార్ రాజధాని పాట్నా సమీపంలోని బక్తియార్‌పూర్‌లో గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరపడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కాల్పుల ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసం ముందు ఉన్న రహదారిపై, బక్తియార్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు కేవలం 50 మీటర్ల దూరంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. బుధవారం బక్తియార్‌పూర్‌లోని దేదార్ గ్రామానికి చెందిన విశాల్ కుమార్, అభిషేక్ కుమార్ 'స్టెయిర్ ఘాట్' వద్ద గంగా హారతిలో పాల్గొని తిరిగి మోటార్‌సైకిల్‌పై ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దుండగులు ఆ ఇద్దరి కోసం కాపు కాశారని పోలీసులు తెలిపారు. వారు అక్కడికి చేరుకోగానే, దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపి, ఇద్దరినీ తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పరారయ్యారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. నిందితుల కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.











