దాడులు కనిపించలేదా.. రాళ్ల మోత వినిపించలేదా..?

బీజేపీ-కాంగ్రెస్ శ్రేణుల పరస్పర దాడులపై డీసీసీ అధ్యక్షుడు బీర్ల అయిలయ్య స్పందన ఎక్కడ?

జిల్లా కేంద్రంలో ఇంతటి ఘటన జరిగినా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పట్టించుకోకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చదాడులు కనిపించలేదా.. రాళ్ల మోత వినిపించలేదా..?

బీజేపీ-కాంగ్రెస్ శ్రేణుల పరస్పర దాడులపై డీసీసీ అధ్యక్షుడు

బీర్ల అయిలయ్య స్పందన ఎక్కడ?

జిల్లా కేంద్రంలో ఇంతటి ఘటన జరిగినా

జిల్లా అధ్యక్షుడు పట్టించుకోకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ

మన తెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న రాజకీయ ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి వచ్చి ధ్వంసానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఒకవైపు.. అనంతరం కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు పరస్పరం దాడులకు దిగడంతో పాటు రాళ్లు రువ్వుకున్నారనే ఆరోపణలు మరోవైపు కలకలం రేపా యి. జిల్లా కేంద్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చుట్టూ చోటుచేసుకున్న ఈ పరిణామాలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఒకవైపు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలోకి ప్రత్యర్థి పార్టీ శ్రేణులు వచ్చి విధ్వంసానికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తుండగా.. మరోవైపు ఇ రుపార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగడం, రాళ్ల దాడులకు పాల్పడినట్లు వెలువడుతున్న సమాచారం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ పార్టీలు బహిరంగ ఘర్షణలకు దిగడం ప్రజాస్వామ్య విలువలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

అయిలయ్య మౌనం.. అనేక ప్రశ్నలు

ఈ మొత్తం వ్యవహారంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ప్రభుత్వ విప్‌గా, ఆలేరు ఎమ్మెల్యేగా ఉన్న బీర్ల అయిలయ్య స్పందించకపోవడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. జిల్లా కేంద్రంలో అధికార పార్టీకి చెందిన కీలక కార్యాలయంపై దాడి జరిగిందనే ఆరోపణలు రావడం, రెండు పార్టీల శ్రేణులు పరస్పరం దాడులకు దిగినట్లు వార్తలు రావడం వంటి పరిణామాలపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో ఆయన స్పందించాల్సిన అవసరం లేదా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

జిల్లాలో ఇంతటి రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంటే డీసీసీ అధ్యక్షుడు ఎక్కడ? అధికార పార్టీ కార్యాలయంపైనే దాడి ఆరోపణలు వస్తుంటే ఖండించాల్సిన బాధ్యత లేదా? కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు పరస్పర దాడులు చేసుకున్నారన ఆరోపణలు వస్తున్నా ఎందుకు మౌనం? ఈ ఘటనపై ఆయన వైఖరి వెనుక కారణమేంటి? అంటూ రాజకీయ ప్రత్యర్థులు, ప్రజల్లో చర్చ మొదలైంది. మౌనం వెనుక మతలబేంటి?

సాధారణ రాజకీయ విమర్శలకే ఘాటుగా స్పందించే నాయకత్వం.. జిల్లా కేంద్రంలో పార్టీకి సంబంధించిన కార్యాలయం చుట్టూ ఇంతటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు మాత్రం మౌనం వహించడం ఎందుకనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ఘటనతో తనకు సంబంధం లేనట్లుగా వ్యవహరించడం రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్న చర్చ జరుగుతోంది.

జిల్లా కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా ఉండాల్సిన డీసీసీ అధ్యక్షుడే కనిపించకుండా పోతే.. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేది ఎవరు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.అయితే ఘటనపై పూర్తి వాస్తవాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఎవరు మొదట దాడికి పాల్పడ్డారు? క్యాంపు కార్యాలయంలో ధ్వంసానికి ఎవరు కారణం? రాళ్ల దాడులకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? అనే అంశాలపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

స్పందిస్తారా.. సమాధానం చెబుతారా?

జిల్లా కేంద్రంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణకు దారితీసిన ఘటనపై బీర్ల అయిలయ్య తన వైఖరిని స్పష్టం చేయాలని రాజకీయ వర్గాలు కోరుతున్నాయి. ఆరోపణలకు తెరదించాలంటే ఆయన స్వయంగా స్పందించి ఘటనపై పూర్తి వివరాలను వెల్లడించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. రాజకీయ పోరాటం ప్రజాక్షేత్రంలో జరగాలి.. రాళ్లు, దాడులు, విధ్వంసాల రూపంలో కాదు. అదే సమయంలో ఇంతటి ఘటన జరిగినా నాయకత్వం మౌనం వహిస్తే.. ఆ మౌనం కూడా రాజకీయంగా ఓ సమాధానమేనా? అనే ప్రశ్న ఇప్పుడు భువనగిరి రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.