ప్రభుత్వానికి ఆదాయం రావడం తప్పు కాదు. కానీ ఆ ఆదాయానికి మూలం ఏమిటన్నదే అసలు ప్రశ్న. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే మద్యం అమ్మకాలపై ప్రభుత్వ ఖజానాలు ఆధారపడాల్సిన పరిస్థితి వస్తే.. అది కేవలం ఆర్థిక అంశంగా చూడగలమా? ఒకవైపు మద్యపానాన్ని తగ్గించాలని ప్రచారం చేస్తూనే.. మరోవైపు మద్యం అమ్మకాల ద్వారా భారీగా ఆదాయం సమకూర్చుకోవడం ప్రభుత్వ విధానాల్లో కనిపిస్తున్న వైరుధ్యాన్ని బయటపెడుతోంది. మద్యం విక్రయాలు పెరిగితే ఖజానా నిండొచ్చు. కానీ అదే సమయంలో కుటుంబాలపై ఆర్థిక భారం పెరగడం, ఆరోగ్య సమస్యలు తీవ్రమవడం, సామాజిక సమస్యలు ఉత్పన్నం కావడం జరుగుతుంటే.. ఆ ఆదాయాన్ని అభివృద్ధికి విజయంగా ఎలా పరిగణించాలి? ప్రజల అవసరాల నుంచి వచ్చే ఆదాయం ఒక ఎత్తయితే.. ప్రజల బలహీనత నుంచి వచ్చే ఆదాయం మరో ఎత్తు. అయితే ప్రశ్న ఒక్కటే -ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థకు మద్యం ఎంతకాలం ప్రధాన ఆధారంగా ఉండాలి? ప్రజల ఆరోగ్యం, కుటుంబాల సంక్షేమం కంటే మద్యం ఆదాయానికే ప్రాధాన్యం ఇస్తున్నామా? అనేది ఆలోచించాలి.

భారతదేశంలో ఏ రాష్ట్ర బడ్జెట్ చూసినా, ఏటా ఆదాయ వనరుల లెక్కలు తీసినా ఒక చేదు నిజం స్పష్టంగా కనిపిస్తుంది. దేశంలోని మెజారిటీ రాష్ట్రాల ఆర్థిక బండిని నడిపిస్తోంది ‘మద్యం’ అమ్మకాలే! ఉచిత పథకాలు, మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు... ఇలా దేనికైనా సరే, మద్యం ద్వారా వచ్చే ఎక్సైజ్ ఆదాయమే రాష్ట్ర ప్రభుత్వాలకు కామధేనువులా మారిందంటే అతిశయోక్తి కాదు. ఒక రకంగా చెప్పాలంటే, నేడు దేశంలో ‘మద్యం అమ్మకాలతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి’ అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. దేశవ్యాప్తంగా వస్తుసేవల పన్ను అమలులోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు సొంతంగా పన్నులు పెంచుకునే హక్కులు చాలా వరకు తగ్గిపోయాయి. కానీ, మద్యం, పెట్రోలియం ఉత్పత్తుల జిఎస్‌టి పరిధి నుంచి మినహాయించారు. ఇదే రాష్ట్ర ప్రభుత్వాలకు అతిపెద్ద అస్త్రంగా మారింది. ఒక విధంగా చెప్పాలంటే వరంగా మారిందనే చెప్పాలి.

ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పుడల్లా, బడ్జెట్ లోటును పూడ్చుకోవడానికి ప్రభుత్వాలు ఎంచుకునే తక్షణ మార్గం మద్యంపై పన్నులు పెంచడమే. బాటిల్ ధర రూ. 1000.. ప్రభుత్వ వాటా రూ. 700! మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వాలు ఏ స్థాయిలో లాభపడుతున్నాయో తెలియజేసే విశ్లేషణ ఇది. మీరు కొనే ప్రతి రూ. 1,000 మద్యం బాటిల్‌పై దాదాపు రూ. 350 నుండి రూ. 700 వరకు పన్నుల రూపంలోనే ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. అంటే మద్యం అసలు తయారీ ధర, రవాణా ఖర్చుల కంటే దానిపై ప్రభుత్వాలు విధించే పన్నులే రెండు మూడు రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. పండుగల సీజన్‌లో కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే వందల, వేల కోట్ల రూపాయల మద్యం అమ్ముడుపోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి కోడిపందాలు, విందు వినోదాల కారణంగా పల్లెల్లో మద్యం ఏరులై పారుతుంది. పట్టణాల కంటే గ్రామీణ జిల్లాల్లో ఈ సమయంలో విక్రయాలు రెట్టింపవుతాయి. తెలంగాణలో దసరా పండుగ సమయంలో మద్యం విక్రయాలు భారీగా ఉంటాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే డిసెంబర్ ఆఖరి మూడు రోజుల్లో అంటే డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కలిపి దాదాపు రూ. 1,000 కోట్ల నుండి రూ. 1,300 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతాయి. ప్రతి నిమిషానికి సగటున 90 కి పైగా లిక్కర్ బాటిళ్లు అమ్ముడవుతుంటాయి. ఈ ట్రెండ్ దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉంది. కేరళలో ఓనమ్ పండుగ సమయంలో కేరళ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా కేవలం 10 -12 రోజుల్లోనే దాదాపు వెయ్యికోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగి సరికొత్త రికార్డు సృష్టించాయి.

మద్యం ఆదాయంలో టాప్ రాష్ట్రాల విషయానికి వస్తే.. దేశంలో మద్యం వినియోగం, దాని ద్వారా వచ్చే రాబడి ఏటా రికార్డు స్థాయిలను తాకుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ఇందులో ముందు వరుసలో ఉన్నాయి. దేశంలో తలసరి మద్యం ఖర్చులో అగ్రస్థానంలో ఉంది తెలంగాణ. ఇక్కడ ఏడాదికి సగటున ఒక వ్యక్తి మద్యం కోసం రూ. 11,351 ఖర్చు చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వానికి దీని ద్వారా ఏటా రూ. 36,000 కోట్ల పైచిలుకు ఆదాయం లభిస్తోంది. ఇక కర్నాటక విషయానికి వస్తే దాదాపు రూ. 34,000 కోట్ల వార్షిక ఆదాయంతో దేశంలోనే అత్యధిక పన్నులు వసూలు చేసే రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. తమినాడు ప్రభుత్వ యాజమాన్యంలోని ‘టాస్మాక్’ (TASMAC) ద్వారా ఏటా రూ. 32,000 కోట్లకు పైగా రాబడి వస్తోందని అంచనా. ఆంధ్రప్రదేశ్ లో తలసరి వార్షిక మద్యం ఖర్చు సగటున రూ. 6,399 గా ఉంది, దీని ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ. 17,500 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాది, పశ్చిమ రాష్ట్రాల్లో కూడా ఏటా రూ. 12,000 కోట్ల నుండి రూ. 14,000 కోట్ల వరకు ఎక్సైజ్ రాబడి వస్తోంది.

ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత విద్య, వైద్య, రైతు భరోసా, పెన్షన్లు వంటి సామాజిక సంక్షేమ పథకాలకు మద్యం అమ్మకాలే ప్రధాన ఇంధనంగా మారుతున్నాయి. మద్యం ద్వారా వచ్చే ఆదాయం నిలిచిపోతే, ఈ పథకాలను కొనసాగించడం దాదాపు అసాధ్యం అనే పరిస్థితి నెలకొంది. అందుకే ఎన్నికల సమయంలో ‘మద్య నిషేధం’ అని హామీలు ఇచ్చే రాజకీయ పార్టీలు సైతం, అధికారంలోకి వచ్చాక ఆర్థిక వాస్తవాలను చూసి వెనకడుగు వేస్తున్నాయి. నిబంధనలను సడలిస్తూ, సరికొత్త మద్యం పాలసీలతో అమ్మకాలను మరింత ప్రోత్సహిస్తున్నాయి. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వాల ఖజానా నిండుతున్న మాట వాస్తవమే అయినా, దీని వెనుక ఒక తీవ్రమైన సామాజిక నష్టం దాగి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల సంపాదనలో అధిక భాగం మద్యం కోసమే ఖర్చవుతోంది. ఒకవైపు సంక్షేమ పథకాల ద్వారా ప్రజల చేతుల్లో డబ్బులు పెడుతూ, మరోవైపు మద్యం ద్వారా ఆ డబ్బును ప్రభుత్వాలు తిరిగి లాక్కుంటున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో మద్యం అనేది ప్రభుత్వాలకు కేవలం ఒక వ్యసనం కాదు... వ్యవస్థను నడిపించే ఇంధనం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.


జి.సత్యనారాయణరాజు

9030880709