భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాలో మద్యం తాగి పది మంది దుర్మరణం చెందారు. బండా పోలీస్ స్టేషన్ పరిధిలోని నౌరోజా, డోగ్రా, బరాజ్, బెమురా బేడా గ్రామాలకు చెందిన 50 మంది మందుబాబులు మద్యం తాగి వాంతులు చేసుకోవడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పది మంది చనిపోయారు. 40 మంది వరకు చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అస్వస్థతకు గురైనవారిని మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలిస్తున్నామన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యంలో విషపూరిత రసాయనం కలిసిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనారోగ్య లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు తెలిపారు.