న్యూఢిల్లీ/హైదరాబాద్, జూలై 31: మేడిగడ్డ మరమ్మత్తులపై ఆగస్టు నెలాఖరు నాటికి బ్లూప్రింట్ సిద్ధం కానుంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి జాతీయ ఆనకట్టల భద్రతా ప్రాధికార సంస్థ (ఎన్‌డిఎస్‌ఎ) శుక్రవారం ఢిల్లీలో సమావేశం నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన మరమ్మతులు, పునరావాస కార్యాచరణ ప్రణాళికను ఈ సమావేశంలో సాంకేతికంగా పరిశీలించినట్లు సమాచారం. మూడు బ్యారేజీల ప్రస్తుత నిర్మాణ స్థితి, భద్రతా ప్రమాణాలు, మరమ్మతుల విధానం, అమలు దశలు, భవిష్యత్‌లో నిర్వహణకు అనుసరించాల్సిన సాంకేతిక ప్రమాణాలపై సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది.

గతంలో ఎన్‌డీఎస్‌ఏ నివేదికలో సూచించిన అంశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర పునరుద్ధరణ ప్రణాళికను సమర్పించినట్లు సమాచారం. అయితే, సమావేశం అనంతరం ఎన్‌డీఎస్‌ఏ నుంచి అధికారిక నిర్ణయం లేదా ప్రకటన విడుదల కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలపై మరింత సాంకేతిక పరిశీలన అనంతరం తుది సిఫార్సులు వెల్లడించే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఎన్‌డీఎస్‌ఏ, కేంద్ర జల సంఘం (సిడబ్లూసి) అనుమతులు లభించిన తర్వాతే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను తిరిగి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువస్తామని ప్రకటించింది.