
బీజింగ్: టిబెట్‌లోని చైనా-నేపాల్ సరిహద్దు ప్రాంతం సమీపంలో భారీ వరదలు ముచెత్తడంతో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు, సహాయక చర్యలు చైపట్టాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ బుధవారంనాడు ఆదేశించారు. ఈ ఘటనలో ప్రాణనష్టం కూడా ఎక్కవగానే ఉంది. జిగాజే విభాగానికి చెందిన పీపుల్స్ ఆరమ్డ్ పోలీసు దశాల నుంచి 145 మంది అధికారులు, సైనికులను ప్రభావిత సరిహద్దు పోర్టుకు పంపించారు. అత్యవసర సహాయక చర్యల్లో వారు పాల్గొంటున్నారు.
టిబెట్‌కు ఆనుకుని ఉన్న రెండు సెంట్రల్ నేపాల్ జిల్లాలను బుధవారం తెల్లవారుజామున ఆకస్మికంగా వచ్చిన భారీ వరద ముంచెత్తింది. కనీసం నలుగురు దుర్మరణం పాలైనట్టు ప్రాథమిక వార్తలు వెలువడ్డాయి. నదీపరివాహక ప్రాంతాల్లోని నివాసాలు, కనీసం 12 జలవిద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. 400 మందికి పైగా గల్లంతయ్యారు. వీరిలో 105 మంది భారతీయులు, 37 మంది ఎన్‌ఆర్‌ఐలు ఉన్నారు.
ఈనేపథ్యంలో ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, గాయపడిన వారికి సకాలంలో వైద్యచికిత్స అందించి ప్రాణనష్టాన్ని తగ్గించాలని జిన్‌పింగ్ ఆదేశించారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో గ్యిరాంగ్ కౌంటీలోని గ్యిరాంగ్ సరిహద్దు పోర్టు వద్ద కొండచరియలు విరిగి పడటంత భారీ నష్టం సంభవించింది. పలువురు ఆచూకీ గల్లంతైంది. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్ తాజా ఆదేశాలు జారీ చేశారు. గాలింపు, సహాయక చర్యలను శాస్త్రీయ పద్ధతిలో చేపట్టడంతో పాటు పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరికల వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, రెండోసారి విపత్తు సంభవించకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
చైనాలోని టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతానికి నేపాల్‌తో సరిహద్దు ఉంది. ఇరుదేశాల మధ్యనున్న సరిహద్దు మార్గానికి సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. పోర్టులోని కొన్ని భవనాలు శిథిలాల కింద కూరుకుపోయినట్టు డ్రోన్ దృశ్యాల్లో కనిపించాయని చైనా అధికారిక మీడియా తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతంలో సమాచార సంబంధాలు తెగిపోయాయని, అక్కడికి స్థానిక ప్రభుత్వం సిబ్బందిని పంపించిందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. చైనా-నేపాల్ సరిహద్దులోని ఉత్తర నేపాల్‌లో రసువా ప్రాంతాన్ని బుధవారం ఆకస్మిక వరదులు ముంచెత్తాయి. దీంతో నేపాల్‌లోని చైనా రాయబార కార్యాలయం ఎమర్జెన్సీ రెస్పాన్స్ మెకానిజంను యాక్టివేట్ చేసింది. ప్రభావిత ప్రాంతంలోని చైనా పౌరులు, సంస్థల పరిస్థితిని రాయబార కార్యాలయం సమీక్షించేందుకు వారిని రక్షించేందుకు నేపాల్ ప్రభుత్వం, సంబంధిత సంస్థలు చర్యలు చేపట్టాలని కోరింది. అలాగే నేపాల్‌లో చైనా పౌరులు, సంస్థల కోసం రాయబార కార్యాలయం తాజాగా భద్రతా సూచనలు సైతం జారీ చేసింది.











