వాషింగ్టన్: హెచ్-1బీ వర్క్ వీసాలపై ప్రతిపాదించిన 1,03,265 డాలర్ల అదనపు రుసుము అమెరికాలోని ఉద్యోగాలను విదేశాలకు తరలించే పరిస్థితి తీసుకురావచ్చని భారతీయ-అమెరికన్ సంస్థ ‘ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్’ (ఫియిడ్స్) ఆందోళన వ్యక్తం చేసింది. ఇంత భారీ రుసుము వల్ల కంపెనీల చట్టబద్ధమైన నియామకాలు కూడా ఆర్థికంగా భారంగా మారతాయి. ఫలితంగా అధిక విలువ కలిగిన ఉద్యోగాలను అమెరికా వెలుపల ఏర్పాటు చేసేలా సంస్థలను ప్రోత్సహించే ప్రమాదం ఉందని ఫియిడ్స్ పేర్కొంది.

అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్) హెచ్-1బీ వీసా పరిమితికి లోబడే అన్ని దరఖాస్తులకు అదనంగా 1,03,265 డాలర్ల రుసుము ప్రతిపాదించిన మరుసటి రోజే ఫియిడ్స్ ఈ ప్రకటన చేసింది. అడ్వాన్స్‌డ్ డిగ్రీ మినహాయింపునకు అర్హమైన దరఖాస్తులకూ ఇది వర్తించనుంది.

జాతీయ భద్రతను పరిరక్షించడం, మోసాలను అరికట్టడం, చట్టబద్ధమైన వలస విధానాన్ని సమర్థంగా నిర్వహించేందుకు డీహెచ్‌ఎస్, యూఎస్‌సీఐఎస్‌లకు తగిన వనరులు అవసరమని ఫియిడ్స్ పాలసీ అండ్ స్ట్రాటజీ విభాగం అధిపతి ఖండేరావ్ కాండ్ అన్నారు. 1,03,265 డాలర్ల హెచ్-1బీ రుసుము వల్ల నగదు కొరత ఎదుర్కొంటున్న స్టార్టప్‌లను తీవ్రంగా దెబ్బతీయవచ్చని పేర్కొన్నారు. వేలాది మంది హెచ్-1బీ ఉద్యోగులను నియమించుకునే కంపెనీలకు అదనంగా వందల మిలియన్ల డాలర్ల భారం పడుతుందని, అది దాదాపు బిలియన్ డాలర్లకు చేరే అవకాశం కూడా ఉందని తెలిపారు.

ఇప్పటికే ప్రతిపాదించిన 1,00,000 డాలర్ల ఓపీటీ రుసుము కూడా అమల్లోకి వస్తే.. మొత్తం వ్యయం 2,03,265 డాలర్లకు చేరుతుందని కాండ్ చెప్పారు. దీంతో విద్యార్థి వీసా నుంచి ఉద్యోగానికి మారే మార్గం సామాన్యులకు దాదాపు అందనంత ఖరీదైనదిగా మారే ప్రమాదం ఉందన్నారు. అమెరికా ప్రభుత్వం మరింత సమతుల్యమైన నిధుల సమీకరణ విధానాన్ని అన్వేషించాలని, కాంగ్రెస్ సంబంధిత సంస్థలకు తగిన నిధులు కేటాయించాలని, దేశానికి అవసరమైన నైపుణ్యమైన ప్రతిభపై పరిశ్రమ వర్గాలు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయాలని ఆయన కోరారు. అమెరికా ఉద్యోగులను రక్షించడం, దేశ సాంకేతిక నాయకత్వాన్ని కొనసాగించడం.. రెండూ కలిసే సాగాలి అని కాండ్ అన్నారు.

ఇదిలా ఉండగా, అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల ప్రవాహం ఇప్పటికే బలహీనపడుతున్న సంకేతాలు కనిపిస్తున్న సమయంలో ఈ ప్రతిపాదన వచ్చిందని ఫియిడ్స్ పేర్కొంది. అంతర్జాతీయ విద్యా సంస్థ (ఐఐఈ) గణాంకాలను ఉటంకిస్తూ.. 2025 లో కొత్తగా చేరిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 17 శాతం తగ్గిందని తెలిపింది.

అలాగే 2026కి సంబంధించి నాఫ్సా రూపొందించిన అంచనాలను ప్రస్తావిస్తూ.. అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 1,11,000 వరకు తగ్గే అవకాశం ఉందని ఫియిడ్స్ పేర్కొంది. ఇది 9.5 శాతం వరకు క్షీణతకు సమానమని, దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు 340 కోట్ల డాలర్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపింది. అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్)కు ఇప్పటికే దాని మొత్తం నిధుల్లో సుమారు 96 శాతం దరఖాస్తుదారులు, పిటిషనర్లు చెల్లించే రుసుముల ద్వారానే సమకూరుతున్నాయని ఫియిడ్స్ పేర్కొంది.