
మన తెలంగాణ/హైదరాబాద్: పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడంలో కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్ర ప్రజా ప్రభుత్వం వెనక్కి తగ్గదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం ఏడాదిగా ఎదురుచూశామని, పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి విడుదల కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంత ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా 2014 నుంచి -23 వరకు దాదాపు పది సంవత్సరాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పేదల ఇళ్ల నిర్మాణం జరగలేదన్నారు.
దీంతో ఇళ్ల నిర్మాణానికి ప్రజల నుంచి భారీ ఎత్తున డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన ఇళ్లను మంజూరు చేయాలని కేంద్రానికి అనేకమార్లు విజ్ఞప్తి చేశామని ఆయన తెలిపారు. కేంద్రం నుంచి నిధులు వస్తాయన్న నమ్మకంతో ఇప్పటివరకు పూర్తయిన ఇళ్లకు సంబంధించిన చివరి బిల్లుల చెల్లింపును తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగౌ చౌహాన్‌ను కలిసి తెలంగాణకు ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్టు మంత్రి పొంగులేటి తెలిపారు.
బ్యాంకు ఖాతాల్లో గురువారం జమ
రాష్ట్రానికి కేంద్ర మంత్రి వచ్చిన సందర్భంలో, రెండు వారాల క్రితం పార్లమెంట్ సభ్యులతో కలిసి తాను స్వయంగా కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశానని మంత్రి పొంగులేటి తెలిపారు. అయినప్పటికీ కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదన్నారు. కేంద్రం నుంచి నిధులు వస్తాయని ఆశ పెట్టుకుని పేద ప్రజలను ఇంకా ఎన్నాళ్లు ఇబ్బంది పెట్టాలని ఆయన ప్రశ్నించారు. ఇల్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారుడు చివరి బిల్లు కోసం ఎదురు చూస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకున్న 15,475 మంది లబ్ధిదారులకు రూ.185 కోట్లను
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. మార్చి 31వ తేదీ వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు చివరి బిల్లుల మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో గురువారం జమ అవుతాయని ఆయన తెలిపారు. మిగిలిన వారికి కూడా విడతల వారీగా నిధులు చెల్లిస్తామన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూన్ 2న ఆదిలాబాద్‌లో ప్రారంభించారని, సెప్టెంబర్ 15వ తేదీలోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు.











