
ప్రజాస్వామ్యానికి చర్చ ప్రాణ వాయువు. ఒక అర్థవంతమైన చర్చకు వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛ ఊపిరి. వీటిని ఇరుసుగా చేసుకొని నిర్మించుకున్నదే మన భారత రాజ్యాంగం. భూమి మీద ఇన్ని దేశాలుండ గా, ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మనం రూపొందించుకు న్నా ఇది తరచూ వివాదాస్పదమవుతోంది. రాజ్యాంగంపైనే దాడి జరుగు తోందని, దాని స్ఫూర్తికి పెను ప్రమాదం ముంచుకు వస్తోందని రాజకీయ, సామాజిక వర్గాల్లో వింటుంటాం. సవరణల ద్వారా ప్రజాస్వామ్య పరిపుష్టికి జరుగుతున్న మేలేమిటో? ఆ మిషతో రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగించ డం వల్ల కలిగే ప్రమాదమేంటో దేశప్రజలకు తెలియాలి. అంటే, ఎప్పటిక ప్పుడు లోతైన చర్చలు, మేధోపరమైన వాదోపవాదనలు జరుగుతూ ఉండాలి. ఒకప్పుడు ఇటువంటి చర్చలు, సభలు, సమావేశాలకు, భేటీలకు పేరుమోసిన హైదరాబాద్ తదనంతరం కొంత కాలం మూగబోయింది. ఇప్పుడిప్పుడే మళ్లీ అటువంటి సభలు, సమావేశాలు, చర్చాగోష్టులకు తెరలేస్తోంది. ఇదొక ఆహ్వానించదగిన శుభసంకేతం
దేశంలో పౌరులు సమాచారం తెలుసుకునే హక్కు కోసం ప్రత్యేకంగా ఒక చట్టం (ఆర్‌టిఐ) తీసుకు వస్తున్న సందర్భంగా 2005లో నాటి ప్రధాని డా. మన్మోహన్ సింగ్ పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్యం పాలనా వ్యవస్థల్లో ఏది జరిగినా ప్రజలకు తెలిసి జరగాలి’ అన్నారు. అదే ఆ చట్టం వెనుక ఉన్న మూల సూత్రం. పారదర్శకతకు అంతకు మించిన ఆవశ్యకత ఇంకేముంటుంది? నాణెం ఒక వైపు తెలుసుకోవడం ప్రజల హక్కు అయినపుడు, అదే నాణెపు రెండో వైపులా తెలియజేయడం సర్కార్ల, పాలకుల బాధ్యత అవుతుంది. ఆ జవాబుదారుతనాన్నే తరచూ ప్రజలు అడుగుతున్నారు. తరచి చూస్తే, నిన్నటి జెన్-జి ఉద్యమం అదే! ఈ సందర్భంగా ప్రజాస్వామ్యపు నాలుగు స్తంభాల్లో ఒకటిగా చెప్పుకునే ‘మీడియా’లో వస్తున్న మార్పులు, పడిపోతున్న ప్రమాణాలు, స్వేచ్ఛ వ్యక్తీకరణపై జరుగుతున్న దాడులు, విశ్వసనీయత పెంచుకోవాల్సిన అవసరం.. తదితరాలపై ‘ప్రెస్ క్లబ్స్ జాతీయ ఫెడరేషన్’ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన జాతీయ కాంక్లేవ్‌లో ఎన్. రామ్ (ది హిందూ), అనంత్‌నాథ్ (కారవాన్) తదితర ముఖ్యులు పాల్గొన్నారు. ఆసక్తికరంగా సాగిన ఈ చర్చ ఇదే అంశంలో మరింత లోతైన చర్చ జరగాల్సిన భవిష్యత్ అవసరాల్ని, అవకాశాల్ని నొక్కిచెప్పింది. ఇటువంటి చర్చలు తరచూ జరుగుతుండాలి.
రెక్క విప్పుతున్న కొత్త ఆశ
ప్రజాస్వామ్యవాదుల గొంతు నొక్కుతున్నారని, ఫాసిస్టు ధోరణులు దేశంలో పెచ్చుమీరుతున్నాయని విమర్శలు బలపడుతున్న వేళ.. ఏ రూపపు మేధో చర్చలైనా ఆహ్వానించదగ్గవే! వచ్చే శనివారం ఖైరతాబాద్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ భవన్‌లో ‘భారత రాజ్యాంగం- రక్షణ’ అంశంపై ప్రసంగ కార్యక్రమాన్ని ఎస్. జయపాల్ రెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యురాలైన మేనకా గురుస్వామి ఈ అంశంపై ప్రసంగించనున్నారు. హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదువుకొని, కొలంబియా, న్యూయార్క్ వంటి యూనివర్శిటీల్లో ఫ్యాకల్టీగా పనిచేసిన ఆమె ఇప్పటికే ఎంతో పేరు తెచ్చుకున్నారు. దేశంలో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో, రాజ్యాంగ రక్షణ తరచూ చర్చనీయాంశమవుతున్న తరుణంలో జరుగుతున్న ఈ ప్రసంగం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో సహ సౌజన్యకులు (కో స్పాన్సరర్స్) గా ఉన్న ‘మంథన్’ సంస్థ కూడ హైదరాబాద్‌లో ఇప్పటికే ఎన్నో ప్రసంగ కార్యక్రమాలు, చర్చా భేటీలు నిర్వహించింది. దేశంలో ప్రఖ్యాతులైన మేధావుల్ని ఆహ్వానించి పలు మీడియా సంస్థలు, కార్పొరేట్లు కూడా తరచూ చర్చాగోష్టులను, ప్రసంగ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ‘వేటూ న్యూస్’, ‘స్టేట్స్‌మెన్’, ‘సౌత్ ఫస్ట్’ వంటివి నగరంలో ఇటీవల నిర్వహించిన సదస్సులు ఇటువంటివే. పర్యావరణ రంగంలో ప్రఖ్యాతి గడించిన జస్టిస్ స్వతంతర్ కుమార్, ఎంసి మెహతా వంటి వారిని ఆహ్వానించి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ (సిజిఆర్) లాంటి పౌర సమాజ సంస్థలు నిర్వహించిన సభలు, సమావేశాలు చర్చాగోష్టులు కూడా ప్రజల్లో ఎంతో అవగాహన పెంచుతున్నాయి. దేశం ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలు, విషయాల్లో పౌరులు, విద్యార్థులు, ఇతర ఆలోచనాపరులు ఎవరికి వారుగా నిర్దిష్ట దృక్పథం ఏర్పరచుకోవడానికి ఇలాంటి చర్చాగోష్టులు, వాదసంవాదాలు ఎంతగానో ఉపయోగపడుతాయి.
మేధో చర్చలకు మేటి హైదరాబాద్
చారిత్రక పరిణామాల్లో వేర్వేరు కాలాల్లో వివిధ స్థాయి మేధో చర్చలకు హైదరాబాద్ పెట్టింది పేరు. నిజాం రాజ్యాపు రోజుల్లో రావి నారాయణరెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి వంటి వారు జాతి వైతాళికులుగా ఇటువంటివి నిర్వహించి, ప్రజానీకాన్ని చైతన్యపరిచారు. ఉస్మానియా విశ్వవిదాలయం,, (ఆర్ట్ కాలేజీ రూమ్ నెం. 57), నిజాం కాలేజీ (సాలార్ జంగ్‌హాల్), కోఠి మహిళా కళాశాల (దర్బార్ హాల్), వైఎంసిఎ హైదరాబాద్, వైఎంసిఎ సికింద్రాబాద్, ఎవి కాలేజీ, వివి కాలేజీ, శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, బొగ్గులకుంటలోని ఆంధ్ర సారస్వత్ పరిషత్ హాలు వంటివి ప్రజ్వలమైన చర్చలకు, మేధోపరమైన వాడివేడి ప్రసంగాలకు వేదికలయ్యేవి. తర్వాతి కాలంలో ఒయు క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియం, ఐసిఎస్‌ఆర్, ఇంటర్నేషనల్ స్టడీ సెంటర్ వంటివి కూడా చర్చలకు తావిచ్చిన వేదికలు. ఆబిడ్స్ గోల్డ్ త్రెషోల్డ్, పబ్లిక్ గార్డెన్ లోని జూబ్లీహాల్, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం వంటి వేదికల నుంచి కూడా ఆరోగ్యకరమైన మేధో చర్చలు అప్పట్లో జరిగేవి. ఎందరివో ప్రసంగాలు సాగేవి. మహబూబియా కాలేజీలో స్వామి వివేకానంద ప్రసంగించిన వేదిక కూడా ఉంది. నిజాం వ్యతిరేక పోరాటం, భారత స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర తొలిదశ, మలిదశ ఉద్యమాలు.. ఇలా సందర్భం ఎపుడైతేనేం, కారణం ఏదయితేనేం మేధో చర్చలకు హైదరాబాద్ నగరం ఆది నుంచీ పుట్టినిల్లుగానే ఉంది.
సంగమ స్థలి
హైదరాబాద్ నగరం వేదిక కట్టిక మేధో ప్రవాహం ఎప్పుడూ ఒకే రకమైన ఆలోచనలకో, భావజాలానికో కట్టుబడింది కాదు. ఒక పక్క కమ్యూనిజం, మరోపక్క గాంధీయవాదం, ఇంకొక పక్క రామమనోహర్ లోహియా వంటి వారిచే ప్రభావితం అయిన సోషలిజం, ‘వందేమాతరం’ మూమెంట్, శ్రీ అరవిందో ఆలోచనా స్రవంతి.. ఇలా పెక్కుపాయలుగా మేధో వికాసం హైదరాబాద్ నగర వీధుల్ని సుసంపన్నం చేసింది. సోషలిజం ధారలో బద్రి విశాల్ పిత్తి, కేశవరావ్ జాదవ్, ప్రతాప్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి లాంటి ఎందరో మేధో చర్చల సరళి సాగించారు. ఆచార్య వినోభాబావే భూదానోద్యమంలో మమేకమైన గాంధేయవాదుల బాట ఒకవైపున సాగేది. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, సంఘ సంస్కర్తలు, రాజనీతిజ్ఞులు, ప్రొఫెసర్లు.. ఇలా ఎన్నో విధాలుగా ఖ్యాతి గడించిన వారు తమ ప్రసంగాలతో నగర ప్రజల్ని మైమరిపించేది. రాజ్‌మోహన్ గాంధీ, గజేంద్ర ఘట్కర్, కె.ఎం. మున్షి, అచ్యుత్ పట్వర్థన్, స్వామి రామానంద తీర్థ వంటి ఎందరెందరో తమ తార్కిక, జ్ఞానదాయక. మేధో ప్రసంగాల ద్వారా ‘చర్చ’ను, తద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిన వారే! ప్ఫెసర్లురొ రాజుల్కర్, వకీలే, రాజ్ గోపాల్, నారాయణ్ కరణ్‌రెడ్డి కొన్ని పేర్లు మాత్రమే!
మేధో చర్చలకు, మేధావుల ప్రసంగాలకు హైదరాబాద్‌ను గట్టి వేదిక చేయడంలో విద్యార్థి యషనియన్లు, వాటికి జరుగుతూండిన ఎన్నికలు కూడా ప్రధానమైన వేదికలే!. జార్జిరెడ్డి, సిరిల్ రెడ్డి తరం నుంచి యూనియన్లకు ఎన్నికలు రద్దయే వరకు అదొక స్వర్ణయుగంగా సాగిందంటే ఆశ్చర్యం లేదు. గొప్ప పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి రాజకీయంగా ఎదిగినా, వరవరరావు విప్లవ కవిగా రాణించినా, కన్నబిరాన్ న్యాయ కోవిదుడిగా ఖ్యాతి గడించినా, బాల గోపాల్ హక్కుల యోధుడిగా పోరాడినా... వారికి హైదరాబాద్ గట్టి మేధో భూమిక అయింది. వారి కృషి హైదరాబాద్ వేదికగా సాగిన మేధో చర్చలకు, ప్రసంగాలకు ముడి సరుకయింది. ఆ రోజుల్లో జరిగిన ప్రజాస్వామ్యపు మేధో చర్చలు, ప్రసంగాల సరళి వేరని చెప్పే పర్యావరణ వేత్త, ఓయు రిటైర్డ్ ప్రొఫెసర్ పురుషోత్తమ్ రెడ్డి (పొలిటికల్ సైన్స్) ‘ఒకే ఒక ప్రసంగంతో విద్యార్థి నాయకులు ఎన్నికలు గెలిచిన సందర్భాలుండేవి’ అంటారు. ‘నా రాజకీయ ఎదుగుదలకు భూమిక అయిన మేధస్సే నా నియోజకవర్గం’ అనే వారు నిజాం కాలేజీలో డిగ్రీ, ఓయూలో పీజీ చేసిన దివంగత నేత జైపాల్ రెడ్డి.
ఒకప్పుడు మేధో చర్చలకు, విజ్ఞాన ప్రసంగాలకు పరిపూర్ణ వేదికగా ఉన్న హైదరాబాద్‌లో మళ్లీ అటువంటి వాతావరణానికి తెరలేవడం హర్షదాయకం. ఆహ్వానించదగ్గ పరిణామం.
దిలీప్‌రెడ్డి
(రచయిత పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్ ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ)











