మన తెలంగాణ/హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు మరోసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిలో భాగంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు ఒకేసారి అందజేయనుంది.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కూడా ఆగస్టు 1వ తేదీ నుంచి మూడు నెలల కోటా బియ్యం పంపిణీకి ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలిసింది. దీంతో రాష్ట్రంలోని అన్ని ఫెయిర్ ప్రైస్ దుకాణాల ద్వారా అర్హులైన రేషన్ కార్డుదారులకు మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి అందజేయనున్నారు. గతంలో కూడా ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విధానాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే.